టికెట్‌ ధరల విషయంలో ఏపీ నిర్ణయం బాగుంది

9 Jan, 2022 03:07 IST|Sakshi
ప్రతాని రామకృష్ణ గౌడ్‌

– ప్రతాని రామకృష్ణగౌడ్‌

‘‘గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాలు.. ఇలా ప్రాంతాలను బట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలు నిర్ణయించడం బాగుంది.. అలాంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో విడుదల చేసిన జీఓ 120 వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు.

ఏపీలోలాగా ప్రాంతాలను బట్టి టికెట్‌ రేటు ఉంటే తప్ప తెలంగాణలో చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి. కచ్చితంగా జీవో 120ని సవరించాలి. అలాగే లీజు విధానాన్ని కూడా రద్దు చేయాలి. థియేటర్స్‌ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. టికెట్‌ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్‌ అద్దెలు కూడా పెంచాలి.. కానీ పెంచడం లేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్‌ నష్టపోతున్నారు. ఇండస్ట్రీ ఆ నలుగురిది మాత్రమే కాదు.

ఆ నలుగురైదుగురి దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు మునిగిపోతున్నారు. అంతటా ఒకే రేటు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి వివరిస్తాం’’ అన్నారు. తెలంగాణ డైరెక్టర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆర్‌. రమేష్‌ నాయుడు, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌. వంశీ గౌడ్, ‘టి మా’ జనరల్‌ సెక్రటరీలు సకమ్‌ స్నిగ్ధ, బి కిషోర్‌ తేజ, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ. కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు