ఆర్జీవీ ఐడియాలజీ మీదే సినిమా ఉంటుంది

8 Aug, 2020 08:59 IST|Sakshi

‘‘రామ్‌గోపాల్‌ వర్మగారు ఒకప్పుడు జీనియస్‌. ‘శివ’ టైమ్‌లో తనని అభిమానించేవాళ్లం. అయితే ప్రస్తుతం ఆయన ఐడియాలజీ వల్ల సమాజానికి నష్టం. మా ‘ఆర్జీవీ’ సినిమాలో ఆయన్ని విమర్శించడమో, ఆయన్ని కామెడీ పాత్రగా చూపించడమో చేయలేదు. మా చిత్రం కేవలం ఆయన ఐడియాలజీ మీదే ఉంటుంది’’ అని నిర్మాత శ్రీనివాస్‌ అన్నారు. ‘కార్తికేయ, కథలో రాజకుమారి’ వంటి చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు). సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రల్లో  జొన్నవిత్తుల రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నిర్మాత శ్రీనివాస్‌ పుట్టినరోజు నేడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ నేను నిర్మించిన ‘కార్తికేయ’ సినిమాకి రెండు నంది అవార్డులతో పాటు సైమా అవార్డు వచ్చింది. ఆ తర్వాత ‘కథలో రాజకుమారి’ సినిమాని నేను అనుకున్నట్టు తీయకపోవడంతో హిట్‌ కాలేదు. అయితే ఆ సినిమా నాకు నష్టం కలిగించలేదు. ‘ఆర్జీవీ’ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభించి జనవరిలో సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం. 4 కోట్ల బడ్జెట్‌తో మా సినిమా రూపొందుతోంది. ఇంత బడ్జెట్‌ సినిమా కాబట్టి థియేటర్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నాం.

మంచి కథ ఉంటే ఓటీటీ కూడా కొంచెం బెస్టే. కచ్చితంగా థియేటర్లు ప్రారంభమవుతాయనుకుంటున్నాం.. కాకుంటే ఓటీటీలో విడుదల చేస్తాం. మా ‘ఆర్జీవీ’ చిత్రంలోని మొదటి పాట ‘ఓడ్కామీద ఒట్టు..’ 20 లక్షల వ్యూస్‌ సాధించింది. ఈ పాట విడుదల తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలామంది నాకు, జొన్నవిత్తులగారికి ఫోన్‌ చేసి డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారని అభినందించారు. ఈ చిత్రంలోని రెండో పాటను ఆదివారం అర్ధరాత్రి 12గంటలకు మణికొండలోని మర్రిచెట్టు వద్ద విడుదల చేస్తున్నాం. నా తర్వాతి సినిమా హీరో రాజశేఖర్‌గారితో ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు