Rangamarthanda Movie: సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైన రంగమార్తాండ.. అక్కడే స్ట్రీమింగ్‌!

7 Apr, 2023 11:14 IST|Sakshi

కొన్ని సినిమాలు బాగుంటాయి. కలెక్షన్లు, బాక్సాఫీస్‌ రికార్డులకు అతీతంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాయి. వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రంగమార్తాండ. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై మధు, వెంకట్‌ రెడ్డి నిర్మించారు. మరాఠీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన నటసామ్రాట్‌కు ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో విడుదలైన పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రసారమవుతోంది.

కథ విషయానికి వస్తే..
రాఘవరావు(ప్రకాశ్‌ రాజ్‌) ఓ రంగస్థల కళాకారుడు. ఆయన ప్రతిభకు మెచ్చి అభిమానులు రంగమార్తాండ బిరుదు ప్రదానం చేస్తారు. అయితే ఆ సత్కార సభలోనే రిటైర్‌మెంట్‌ ప్రకటించి అందరికీ షాకిస్తాడు. తన ఆస్తులను కూడా పిల్లలకు పంచేస్తాడు. కొడుకు, కోడలికి ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, కూతురికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకున్న సొమ్మును అప్పగిస్తాడు. ప్రేమించినవాడితో పెళ్లి కూడా చేస్తాడు.

అన్ని బాధ్యతలు తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి ఆయన శేష జీవితం ఆనందంగా సాగిందా? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు? అతడి నిజజీవితం ఎలా ముగిసిందనేది మిగతా కథ.

మరిన్ని వార్తలు