అన్ని సినిమాలు ఉన్నాయండోయ్‌!

22 Apr, 2021 03:49 IST|Sakshi

ఉందా? లేదా? లేదట.... కాదు.. కాదు.. ఉందట! ఈ మధ్య కొన్ని చిత్రాల గురించి జరిగిన చర్చ ఇది. ‘ఆగిపోయింది’ అంటూ ఆ చిత్రాలపై వచ్చిన వార్తలకు స్పందించి... ‘ఉందండోయ్‌’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ఆ చిత్రాలేంటో చూద్దాం.

బంగార్రాజు వస్తాడు
ఐదేళ్ల క్రితం సంక్రాంతి పండగకి నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. బంగార్రాజుగా పంచె కట్టుకుని, ‘సోగ్గాడే చిన్ని నాయనా.. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..’ అంటూæ అమ్మాయిలతో నాగ్‌ వేసిన స్టెప్పులు అదుర్స్‌. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో బంగార్రాజు, రాము పాత్రల్లో నటించారాయన. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ని ఎప్పుడో ప్రకటించారు. ప్రీక్వెల్‌ అంటే.. ముందు జరిగిన కథ అన్నమాట.. ‘సోగ్గాడే..’లో బంగార్రాజు చనిపోతాడు... అసలు బంగార్రాజు కథేంటి అనేది ప్రీక్వెల్‌. అయితే ‘సోగ్గాడే..’ వచ్చి ఐదేళ్లు కావడంతో ప్రీక్వెల్‌ ఇంకా మొదలుపెట్టలేదు కాబట్టి, ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ, ఆగలేదు. ఈ విషయాన్ని ‘వైల్డ్‌ డాగ్‌’ ప్రమోషన్స్‌ అప్పుడు నాగార్జున స్వయంగా చెప్పారు. సో... ‘బంగార్రాజు ఈజ్‌ బ్యాక్‌’. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉంది.

ఆన్‌లోనే ఉంది
హీరో అల్లు అర్జున్‌–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌ సినిమా ఎప్పుడో రూపొందాల్సింది కానీ, ఇప్పటివరకూ జరగలేదు. ఇక ఈ కాంబినేషన్‌ లేనట్లే అని ఈ మధ్య చాలామంది ఫిక్సయ్యారు. దానికి కారణం ‘పుష్ప’ పూర్తి చేశాక కొరటాల శివ సినిమాలోనే అల్లు అర్జున్‌ చేయాలి. కానీ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల దర్శకత్వం వహించే సినిమా తెరపైకి వచ్చింది. దాంతో బన్నీ–కొరటాల సినిమా లేనట్లే అని ఎవరికివారు ఫిక్సయ్యారు. కానీ, ‘ప్రాజెక్ట్‌ ఆన్‌లోనే ఉంది’ అని నిర్మాణ సంస్థ యువసుధ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఈ సినిమా ఆరంభం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ అనే చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్‌ లేదనే వార్తలు వచ్చాయి కానీ, ‘ఐకాన్‌’ ఉంటుందని ఇటీవల ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు.

మారలేదు
‘ప్లాన్‌ మారలేదు.. ముందు అనుకున్న ప్రకారమే ముందుకు వెళతాం’ అంటూ ఇటీవల ఫాల్కన్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ప్రకటించింది. విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న సినిమా గురించే ఈ ప్రకటన. ఈ సినిమా లేదంటూ వచ్చిన వార్తలకే ‘ఉంది’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’లో నటిస్తున్నారు. సుకుమార్‌ ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ చిత్రాలు పూర్తి చేశాక.. వీరి కాంబినేషన్‌ సినిమా ఆరంభమవుతుంది.

భారతీయుడు ఆగడు!
కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్‌’ (భారతీయుడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం వచ్చిన పాతికేళ్లకు ‘ఇండియన్‌ 2’కి శ్రీకారం చుట్టారు కమల్‌–శంకర్‌. కొన్నాళ్లు షూటింగ్‌ కూడా జరిగింది. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల కోసం కమల్‌ బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ ఒక సినిమా ప్రకటించడం, అలాగే రణ్‌వీర్‌ సింగ్‌తో ‘అన్నియన్‌’ (అపరిచితుడు) రీమేక్‌ ప్రకటించడంతో ‘భారతీయుడు 2’ ఏమైంది? అనే టాక్‌ మొదలైంది. ‘ఇండియన్‌ 2’ నిర్మాణ సంస్థ లైకా కూడా కూడా శంకర్‌ ఈ సినిమాని మధ్యలో వదిలేయడం సరికాదని కోర్డుకెక్కింది. ‘‘నేనేం వదల్లేదు.. ‘భారతీయుడు ఆగడు’. దీనికి విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. అలాగే కమల్‌ డేట్స్‌ ఇస్తే.. నేను షూట్‌కి రెడీ’ అని శంకర్‌ విన్నవించుకున్నారు.

చిన్న బ్రేక్‌.. అంతే!
కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట.  గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్‌’ అనే సినిమాని ప్రకటించారు కరణ్‌ జోహార్‌. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్‌వీర్‌ సింగ్, అనిల్‌ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్‌ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ‘తక్త్‌’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్‌ పడింది.. అంతే’’ అని కరణ్‌ జోహార్‌ అన్నారు.

‘ఖిలాడి’గా రవితేజను, ‘టక్‌ జగదీష్‌’గా నానీని, ‘వరుడు కావలెను’లో నాగశౌర్యను ఇదివరకే చూశాం. పలు సందర్భాల్లో ఈ చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి, శ్రీరామ నవమికి కూడా ఈ చిత్రాల ఫొటోలు విడుదలయ్యాయి. రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక, హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లు, నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రా నికి లక్ష్మీ సౌజన్య దర్శకురాలు.

మరిన్ని వార్తలు