హైదరాబాద్‌ టు ముంబై... బాలీవుడ్‌లో ఫేమస్‌ విలన్‌.. హీరోల వల్ల కెరీర్‌ నాశనం!

1 Mar, 2024 13:44 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు. లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తారని భ్రమిస్తుంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే ఒకప్పుడు నటులు ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్లకు కట్టినట్లు వివరించాడు దివంగత విలన్‌ అజిత్‌ తనయుడు షెహజాద్‌ ఖాన్‌. అతడు మాట్లాడుతూ.. 'సూపర్‌ హిట్‌ మూవీ నయా డౌర్‌(ఈ మూవీకి అజిత్‌ సహాయక నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు) తర్వాత నాన్న కెరీర్‌ పతనం కావడం ప్రారంభమైంది. నాలుగైదేళ్లపాటు అతడికి అవకాశాలు రాలేదు. ఏ పనీ చేయలేదు.

హీరోల వల్లే నాన్నకు కష్టాలు..
ఇందుకు ప్రధాన కారణం.. హీరోలకున్న భయమే! నాన్న సినిమాలో ఉంటే ఎక్కడ వారిని డామినేట్‌ చేస్తాడో అని భయపడ్డారు. ఆయనతో పని చేస్తే తనకే గుర్తింపు వస్తుంది, తనకే అవార్డులిచ్చేస్తారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరని ఫీలయ్యారు. అందుకని అవకాశాలివ్వలేదు. అలా ఎన్నో కష్టాలు చూశాడు. కెరీర్‌ ప్రారంభంలో అయితే అంతకన్నా ఎక్కువే చూశాడు. ఓరోజు ముంబైలో మొహమ్మద్‌ అలీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న మురికి కాలువను చూపిస్తూ దీని పక్కనే పడుకున్నానని చెప్పాడు.

ఆస్తులు లాక్కున్న బంధువులు
హైదరాబాద్‌ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో రోడ్డుపైనే నిద్రపోయానన్నాడు. తన కాలేజీ పుస్తకాలు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ముంబైకి వచ్చాడు' అని తెలిపాడు. మొదట్లో కష్టాలతోనే సావాసం చేసిన అజిత్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్లు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. 1960, 70వ దశకంలో టాప్‌ విలన్‌గా రాణించాడు. 1998లో మరణించాడు. కొంతకాలానికి ఆయన మూడో భార్య సారాకు క్యాన్సర్‌కు సోకింది. ఆ సమయంలో ఆమె వైద్య ఖర్చులు భరించడానికి షెహజాద్‌ అన్నయ్య ముందుకురాలేదట!

ఆస్పత్రి బిల్లు కూడా కట్టలే!
'నాన్న పోయాక ఆయన కూడబెట్టిన డబ్బునంతా అన్నయ్య, బంధువులే పంచుకున్నారు. దీంతో అమ్మకు మంచి వైద్యం అందించడం నాకెంతో కష్టమైంది. అమ్మ చనిపోయినప్పుడు రూ.5000 ఆస్పత్రి బిల్లు కట్టడానికి కూడా అన్నయ్య నిరాకరించాడు. కానీ ఆమె ఆస్తులు, నగలు మాత్రం అన్నీ తీసుకున్నాడు' అని విచారం వ్యక్తం చేశాడు. కాగా షెహజాద్‌ అందాజ్‌ అప్నా అప్నా అనే సినిమాలో భల్లా అనే పాత్రతో ఫేమస్‌ అయ్యాడు. ఇతడు కూడా నటుడిగా రాణిస్తున్నాడు.

చదవండి: సౌత్‌ ఇండస్ట్రీలో నటికి చేదు అనుభవం.. ఆఫీసుకు రమ్మని చివరకు..

whatsapp channel

మరిన్ని వార్తలు