Sherni Movie Review: ఆలోచన రేపే… అటవీ కథ

18 Jun, 2021 18:54 IST|Sakshi
Rating:  

చిత్రం: ‘షేర్నీ’
తారాగణం: విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా
కథ - మాటలు: ఆస్థా టిక్కూ
నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్
దర్శకత్వం: అమిత్ మసూర్కర్
సంగీతం: బందిష్‌ ప్రొజెక్ట్‌, ఉత్కర్ష్‌ ధోతేకర్‌
నేపథ్య సంగీతం: బెనిడిక్ట్‌ టేలర్‌
కెమెరా: రాకేశ్ హరిదాస్;
ఎడిటింగ్: దీపికా కాల్రా
రిలీజ్: 2021 జూన్ 18(అమెజాన్ ప్రైమ్)

అభివృద్ధి అనేది ఎప్పుడూ సాపేక్షమే! కొన్నిసార్లు అభివృద్ధి పేరిట మనిషి చేసే చర్యలు పురోగతి కన్నా ప్రకృతి వినాశనానికి దారి తీస్తాయి. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటివి ఇప్పుడు విస్తృత ప్రచారంలో ఉన్నా, నిజంగా మనం చేస్తున్నది ఏమిటనేది ఆలోచిస్తే? చిరుతపులుల లాంటి వన్యప్రాణుల విషయంలో మన మాటలకూ, చేతలకూ ఎంత తేడా ఉంది? ఇలాంటి అంశాలన్నిటినీ తీసుకొని, రూపొందిన చిత్రం – ‘షేర్నీ’. మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’) లాంటివి పులి వేటను జనాకర్షకంగా చూపిస్తే, నాణేనికి రెండు వైపును ‘షేర్నీ’ పరిచయం చేస్తుంది. 

కథేమిటంటే..
మూడేళ్ళ క్రితం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో అవని అనే ఆడ చిరుతను చంపడం వివాదాస్పదమైంది. అప్పట్లో ప్రమీలా ఇస్తారీ అనే ఆవిడ అడవిలో కొన్ని కిలోమీటర్లు కాలినడకన వెతికి, ఆ ఆడపులి తాలూకు పిల్లల్ని కాపాడింది. ఆ నిజజీవిత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ క్రెడిట్స్ ఏమీ ఇవ్వకుండా ఈ ‘షేర్నీ’ కథను రాసుకున్నారు. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి (హిందీలో షేర్నీ) మనుషుల్ని గాయపరుస్తుంది. పులి బారి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపించి అయినా ఓట్లు కూడగట్టుకోవాలని రాజకీయ నేతల ఆకాంక్ష. రెండు పులికూనల్ని కన్న ఆ ఆడపులిని కాపాడాలనుకొనే ఫారెస్ట్ ఆఫీసర్ హీరోయిన్ (విద్యాబాలన్). పులిని పట్టుకోవడం కన్నా, చంపేసి వీ7రుడినని అనిపించుకోవాలనే వేటగాడు (శరత్ సక్సేనా). ఈ పాత్రల మధ్య షేర్నీ కథ నడుస్తుంది. ఆడపులిని, మహిళా అధికారినీ పోల్చకుండానే పోలుస్తూ, సమాజంలో ఎదురయ్యే కష్టాన్ని సూచనప్రాయంగా చెబుతుందీ కథ. 

ఎలా చేశారంటే..
ఆడ చిరుతపులి కోసం అన్వేషణ సాగే ఈ చిత్రంలో నిజానికి ప్రధానపాత్ర పులే. కథ అంతా పులి గురించే అయినా, చెప్పదలుచుకున్న పాయింట్ వేరు గనక తెరపై పులి కనిపించే దృశ్యాలు మాత్రం తక్కువే. పులులను కాపాడాలని తపించే కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ విద్యా విన్సెంట్ గా జాతీయ అవార్డు నటి విద్యా బాలన్ బాగా చేశారు. సిల్క్ స్మిత జీవితకథపై వచ్చిన ‘డర్టీ పిక్చర్’ మొదలు గణిత మేధావి ‘శకుంతలా దేవి’ బయోపిక్ దాకా చాలా పాత్రల్లో రాణించిన విద్యాబాలన్ మరోసారి మెప్పించారు. పరిమితులు దాటని అభినయంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, చివరలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో మనసు కదిలించారు. మానవత్వం లేని మనుషుల కన్నా, మ్యాన్ ఈటర్ అని ముద్ర పడ్డ పులి మీద సానుభూతి కలిగేలా చేశారు. విద్యాబాలన్ తో కలసి పనిచేసే ప్రొఫెసర్ హసన్ నూరానీగా విజయ్ రాజ్ సహజమైన నటనతో మెప్పిస్తారు. చాలాకాలం గుర్తుంటారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన శరత్ సక్సేనా ఇందులో పాతిక పులుల్ని చంపిన వేటగాడు పింటూగా కనిపిస్తారు. విద్యాబాలన్ అత్తగారి పాత్రలో ఇలా అరుణ్, మరీ ముఖ్యంగా విద్యాబాలన్ పై అధికారి బన్సల్ గా చేసిన బ్రిజేంద్ర కాలా తదితరులు ఈ సీరియస్ కథలో రిలీఫ్ ఇస్తారు. 

ఎలా తీశారంటే..
మన దేశంలో పులుల సంరక్షణకు సంబంధించి వాస్తవ పరిస్థితులను ఈ రెండు గంటల పైచిలుకు సినిమా కళ్ళకు కడుతుంది. మన దగ్గర అటవీ శాఖ ఎలా పనిచేస్తుంటుందో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. అభయారణ్యాల చుట్టుపక్కల గ్రామాలు, అక్కడి ప్రజలు, వాళ్ళ మీద రాజకీయ నాయకుల ప్రభావం లాంటివి ఇందులో చూడవచ్చు. ఒక దశలో పులి కన్నా మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు ఎంత క్రూరమైనవో ఈ కథ గుర్తు చేస్తుంది. పులుల లాంటి వన్యప్రాణుల నివాసాలలో గనుల తవ్వకాల లాంటివి చేపట్టి, వాటి ఇంట్లో చేరిన మానవుడు అవి జనావాసాలకు హాని కలిగిస్తున్నాయంటూ వాటినెలా మట్టుబెడుతున్నాడో చెప్పకనే చెబుతుంది. మనుషులు, జంతువులు సహజీవనం చేయాల్సి ఉంది. అది అటవీ, వన్యప్రాణి సంరక్షకులు పదే పదే చెప్పేమాట. కానీ, దాన్ని గాలికి వదిలేసి పులుల వేట మనిషి వీరత్వానికి ప్రతీక అనుకొంటూ, స్పృహ లేని పనులు చేయడాన్ని చర్చకు పెడుతుంది. 

నైట్ ఎఫెక్ట్ లో, అందమైన అటవీ ప్రాంతాల చిత్రీకరణలో రాకేశ్ హరిదాస్ పనితనం కనిపిస్తుంది. అయితే, ‘షేర్నీ’ చాలా సందర్భాల్లో సినిమాలా కాకుండా, సెమీ డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. తీసుకున్న అంశం మంచిదైనా, దాన్ని మరింత ఎమోషనల్ గా, ఎఫెక్టివ్ గా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కథ చాలా నిదానంగా నడిచిందనీ అనిపిస్తుంది. మొదట్లో కన్నా పోనూ పోనూ కథ, కథనం చిక్కబడి, చివరకు ఆసక్తి పెరుగుతుంది. అప్పటికి కాస్తంత ఆలస్యమైపోతుంది. అది ఈ సినిమాకు ఉన్న బలహీనత. అయితే, ‘న్యూటన్’ చిత్రం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు అమిత్ మసూర్కర్ ఈసారీ తన మార్కు చూపారు. మనిషికీ, జంతువుకూ మధ్య ఉండే ఘర్షణ నేపథ్యంలోనే అధికారుల అవినీతి, నేతల ఎన్నికల రాజకీయ స్వార్థాలు, అటవీ గ్రామాల్లోని గిరిజనుల మంచితనం – ఇలా చాలా అంశాలను చూపెట్టారు. ఆశావాదం అతిగా చూపకుండా, మనసు చివుక్కుమనే ముగింపుతో ఆలోచింపజేశారు. ఆ మేరకు ‘షేర్నీ’ సక్సెస్.
కొసమెరుపు: ఓ సెమీ డాక్యుమెంటరీ శైలి సినిమా!

బలాలు  
ఎంచుకున్న కథాంశం
కెమెరా వర్క్
విద్యాబాలన్ సహా పలువురి నటన

బలహీనతలు 
స్లో నేరేషన్
డాక్యుమెంటరీ తరహా కథనం
పులికూనల సంరక్షణను హడావిడిగా ముగించడం 
- రెంటాల జయదేవ 

Rating:  
(2.25/5)
మరిన్ని వార్తలు