Yasaswi Kondepudi Controversy: చీటింగ్‌ ఆరోపణలు.. చిన్నారులను దత్తత తీసుకోలేదన్న సింగర్‌

10 Feb, 2023 09:55 IST|Sakshi

సరిగమప విన్నర్‌ యశస్వి కొండెపూడి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి.. తాను చేసిన సేవాకార్యక్రమాల గురించి వెల్లడించాడు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని నవసేవ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు ఫరా కౌసర్‌ మండిపడ్డారు. నవసేన ఎన్జీవో ద్వారా 50-60 మందిని చదివిస్తున్నట్లు చెప్పాడని, కానీ అదంతా వట్టి అబద్ధమని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై యశస్వి స్పందించాడు.

'నవసేనకు, ఆ ఎన్జీవోలోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకున్నట్లు నేనెక్కడా చెప్పలేదు. నేను వాళ్ల దగ్గరకు వెళ్లలేదు, నాకసలు సంబంధమే లేదు. సాధ్య ఫౌండేషన్‌కు మా కుటుంబమంతా సహాయం చేస్తుంటాం. ఈ ఫౌండేషన్‌ తమకు నచ్చిన సంస్థలకు సాయం చేస్తుంటుంది. అలా వాళ్లు కాకినాడలోని ఓ అనాధాశ్రమానికి సాయం చేశారు. మా బ్రదర్స్‌ సాధ్య ఫౌండేషన్‌కు సాయం చేశారు. దానిద్వారా వారు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు సాయం చేశారు. కాబట్టి వాళ్లతో ఆల్‌ద బెస్ట్‌ చెప్పించుకుంటామన్నారు. నవసేన నిర్వాహకులు ఫరా కుటుంబం ఎదురుగానే పిల్లలతో ఆల్‌ద బెస్ట్‌ చెప్పిస్తూ వీడియోలు చేశారు. నా ఫ్యాన్స్‌ కూడా పుట్టినరోజు నాడు అదే ట్రస్టులో పిల్లలతో కేక్‌ కట్‌ చేసి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఆ వీడియోలన్నింటిని చిన్నగా కట్‌ చేసి ప్రోమోలో యాడ్‌ చేశారు.

అందులో నవసేన అన్న బోర్డు కనిపించింది. మా బోర్డు వాడుకున్నారు, కానీ పిల్లలను చూపించలేదు అని ఆమె అడిగారు. ఇది ప్రోమోనే, ఎపిసోడ్‌లో అంతా వస్తుందని చెప్పాను. అయినా ఆమె ఇంత రాద్ధాంతం చేస్తుండటంతో ప్రోమో డిలీట్‌ చేయించా. ఎపిసోడ్‌లో కూడా అవేవీ ఉండకుండా ఎడిట్‌ చేసేయమన్నాను. ఇంతవరకు నా జీవితంలో ఎక్కడా నాకు నెగెటివ్‌ మార్క్‌ లేదు, ఇప్పుడిదంతా జరుగుతుంటే చాలా బాధగా ఉంది. పిల్లలను అడ్డు పెట్టుకుని నేనెందుకు ఫేమ్‌ తెచ్చుకోవాలనుకుంటాను. ఆమె ఫోన్‌ చేసి మా సంస్థ బోర్డు చూపించారు, కాబట్టి 9 నెలల దాకా అనాధాశ్రమాన్ని దత్తత తీసుకోవాలంటున్నారు. నాకు ఉన్నంతలో సాయం చేస్తాను, కానీ దత్తత ఎలా తీసుకుంటాను? అన్నాను. దీంతో ఆమె లీగల్‌గా వెళ్తానంది. మాట విననప్పుడు ఏం చేస్తాను, సరేనన్నాను. కానీ నాకు బుద్ధి తక్కువై ఎపిసోడ్‌కు వీడియోలు ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు యశస్వి.

మరిన్ని వార్తలు