'అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది'.. శివాని క్రేజీ కామెంట్స్!

15 Nov, 2023 18:57 IST|Sakshi

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. ఈ చిత్రంలో  శ్రీకాంత్,  వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2  బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  శివాని రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో  ట్రైబల్ అమ్మాయిగా నటించా.  ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం..  నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి  ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. 

గ్లామరస్ పాత్రల గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే వాటి గురించి ఆలోచించడం లేదు. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతా. నచ్చింది చేసుకుంటూ పోవడమే నా పని. రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. మా కథల విషయంలో అమ్మా, నాన్న  జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది.' అని అన్నారు. శ్రీకాంత్ సార్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారని తెలిపింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు