Sonu Gowda Case Updates: 'బిగ్‌ బాస్‌' నటికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. జైలుకు తరలింపు

26 Mar, 2024 07:28 IST|Sakshi

కన్నడ నటి, బిగ్‌ బాస్‌ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. సోనూ గౌడకు ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించడంతో  ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

నటి ఏం చెప్పింది..?
జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్  కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మీడియాతో స్పందించిన సోను శ్రీనివాస్ గౌడ.. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని తెలిపింది. నేను ఒక అమ్మాయిని తీసుకువచ్చాను ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం రక్షణ అవసరం, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే నేను తెచ్చుకున్నాను. నేనే ఆమెను సురక్షితంగానే చూసుకున్నాను.

ఏం జరిగింది..?
గత మార్చి 2న సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో, ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. అది కూడా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. రాయచూర్‌కు చెందిన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు అందులో సోనూ పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను అంగీకరించాలి.

అలాగే, సోనూ గౌడ ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఇది అమ్మకాల ప్రక్రియగా కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం ఆమెది స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన వయసు.. కానీ ఆ బాలిక విషయంలో ఇది జరగలేదు. పలువురు ఫిర్యాదు చేయడంతో సోనూ గౌడను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  పోలీసులు చిన్నారిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు.

Election 2024

మరిన్ని వార్తలు