బీజేపీ జాబితాలో పెరిగిన మహిళా అభ్యర్థులు.. కొత్త ముఖాలు ఎన్నంటే? | Sakshi
Sakshi News home page

బీజేపీ జాబితాలో పెరిగిన మహిళా అభ్యర్థులు.. కొత్త ముఖాలు ఎన్నంటే?

Published Tue, Mar 26 2024 7:23 AM

New Faces and Women in BJP Lok Sabha 2024 List - Sakshi

ఢిల్లీ: 400 లోక్‌సభ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఇప్పటికి 398 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కొత్త అభ్యర్థులు ఎంత మంది, మహిళలు, సిట్టింగ్ ఎంపీలు ఎంతమంది ఉన్నారనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..

భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం 398 మంది అభ్యర్థులలో 17 శాతం.. అంటే 66 మంది మహిళలు ఉన్నారు. ఇది గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల సంఖ్య కంటే ఎక్కువ. 2009లో బీజేపీ 433 మంది అభ్యర్థులలో కేవలం 45 మంది మహిళలు ఉన్నారు. ఆ తరువాత 2014లో 428 మంది అభ్యర్థుల్లో 38 మంది, 2019లో 436 మంది పోటీదారుల్లో 55 మంది మహిళలు ఉన్నారు.

2014 జాబితాలో బీజేపీ 99 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. 2019లో గెలిచిన అభ్యర్థులలో మూడింట ఒక వంతు అభ్యర్థులను మాత్రమే పార్టీ పునరావృతం చేసింది. కాగా ఈసారి 94 మంది కొత్త ముఖాలను పార్టీ బరిలోకి దింపింది.

గెలుపు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అనేక పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. దీంతో బీజేపీ మిత్ర పక్షాలు ఎక్కువయ్యాయి. కాబట్టి  ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 63 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 17 స్థానాలలో అప్నా దళ్, దాని మిత్రపక్షాలలు పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. 

పంజాబ్‌లోని 13 స్థానాలకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అక్కడ శిరోమణి అకాలీదళ్‌తో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 48 స్థానాలకు 23 మంది అభ్యర్థులను మాత్రమే బీజేపీ ప్రకటించింది. అక్కడ అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో సీట్ల షేరింగ్ ఫార్ములాను రూపొందిస్తోంది.

కర్ణాటకలో బీజేపీ 24 మంది, అస్సాంలో 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసోమ్ గణ పరిషత్ & యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ పార్టీలకు మూసు సీట్లను వదిలిపెట్టింది. ఇక జమ్మూ కాశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. వాటిలో సిట్టింగ్ ఎంపీలైన జుగల్ కిషోర్ శర్మ, జితేంద్ర సింగ్‌లను పోటీకి దింపింది.

ఆదివారం (మార్చి 24) సాయంత్రం బీజేపీ విడుదల చేసిన 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాలో.. మీరట్ ఎంపీ రాజేంద్ర అగర్వాల్, నటుడు అరుణ్ గోవిల్, ఘజియాబాద్ ఎంపీ మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్, బడాయున్ ఎంపీ సంఘమిత్ర మౌర్యతో సహా 23 మంది సిట్టింగ్ ఎంపీలను తొలగించింది. కంగనా రనౌత్ వంటి వారికి బీజేపీ ఈ ఏట అవకాశం కల్పించింది. 

Advertisement
Advertisement