సంగీత దర్శకుడిగా బాలు

26 Sep, 2020 05:34 IST|Sakshi

గాయకులుగా ఉంటూ సంగీత దర్శకత్వం చేసిన వారిలో చిత్తూరు నాగయ్య, ఘంటసాల, భానుమతి రామకృష్ణ తర్వాత ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం వస్తారు. నెల్లూరులో పాట కచ్చేరీలు ఇచ్చే నాటి నుంచే సొంతగా పాట రాసి ట్యూన్‌ కట్టే ప్రయత్నం చేసిన బాలు సినిమా గాయకుడిగా బిజీ అయ్యాక సంగీత దర్శకుడిగా పాటలు చేయాలని ప్రత్యేకంగా ప్రయత్నించలేదు. కాని ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడైన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ‘కన్య–కుమారి’ (1977) సినిమాకు తొలి అవకాశం ఇచ్చారు. వేటూరి రాసిన ‘ఇది తొలి పాట’ బాలు స్వరపరిచిన తొలి పాట. ఈ పాటను ఆ తర్వాత ఆయన తన ప్రతి కచ్చేరీలో పాడేవారు. అయితే గాయకుడిగా చాలా బిజీగా ఉంటున్న బాలూను సినిమా సంగీతం కోసం అడగడం నిర్మాత దర్శకులకు కొంత సంశయం అనే చెప్పాలి. ఎందుకంటే దానికి వారు అడిగినంత సమయం బాలు ఇవ్వలేకపోవచ్చు అనే సందేహం ఉండేదేమో. అయినప్పటికీ తెలుగులో బాలు 31 సినిమాలకు సంగీతం వహించారు.  తమిళంలో 5, కన్నడంలో 9 సినిమాలు ఆయన స్వర పర్యవేక్షణలో వచ్చాయి.

బాపుతో కలిసి
దర్శకుడు బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాకు బాలు చేత పాటలు చేయించుకున్నారు. ఇవి మంచి అభిరుచి ఉన్న పాటలుగా నిలిచాయి. జాలాది రాసిన ‘సందె పొద్దు అందాలున్న చిన్నది’, ఆరుద్ర రాసిన ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలుకమ్మ’ పాటలు నేటికీ నిలిచి ఉన్నాయి. చుట్టూ చెంగావి చీర పాటకు మెహదీ హసన్‌ ‘రఫ్తా రఫ్తా’ ప్రేరణ. ఆ తర్వాత బాపూతో బాలు ‘సీతమ్మ పెళ్లి’, ‘జాకీ’ సినిమాలు చేశారు. ‘సీతమ్మ పెళ్లి’ తమిళంలో సూపర్‌హిట్‌ చిత్రానికి రీమేక్‌. అయినప్పటికీ ఆ పాటల ఛాయలు లేకుండా ఒరిజినల్‌ పాటలు చేశారు బాలు. అందులోని ‘చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే’ పాట ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఇక ‘జాకీ’లో పాటలన్నీ హిట్టే. శోభన్‌బాబు, సుహాసిని నటించిన ఈ సినిమాలో బాలు, జానకి పోటీలు పడి పాడారు. ‘శశివదన మొరను వినలేవా’, ‘అలా మండి పడకే జాబిలీ’, ‘నిదుర లెమ్ము నిమ్మకాయ’ అలరించాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమాను బాపు హిందీలో ‘హమ్‌ పాంచ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తే బాలు దానికి రీ రికార్డింగ్‌ చేశారు.

జంధ్యాలతో
జంధ్యాలతో బాలూ చేసిన ‘పడమటి సంధ్యారాగం’ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాకు పేరు బాలూయే పెట్టారు. అందులో ‘లైఫ్‌ ఈజ్‌ షాబీ’ పాటను రాసి పాడారు కూడా. ఇందుకోసం అమెరికాలో పాటను రికార్డు చేసి, అలా రికార్డు చేసిన తెలుగు సినిమా రికార్డును సొంతం చేసుకున్నారు. పడమటి సంధ్యారాగంలోని ‘ఈ తూరుపు ఆ పశ్చిమం’ పాట బాలు చేసిన చాలామంచి పాటల్లో ఒకటి. అలాగే ‘పిబరే రామరసం’ పాట ఎంతో స్పందనాయుతంగా ఉంటుంది. జంధ్యాలతో ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ సినిమాలు చేశారు బాలు.

అవార్డు తెచ్చిన సినిమా
బాలూకు అవార్డులు, రివార్డులు తెచ్చి పెట్టిన సినిమాగా ‘మయూరి’ని చెప్పవచ్చు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలు సంగీత ప్రతిభకు ఒక తార్కాణంగా నిలిచింది. ఇందులో ‘ఈ పాదం ఇలలోని నాట్య వేదం’, ‘ఇది నా ప్రియనర్తన వేళ, ‘మౌనం గానం మధురం మంత్రాక్షరం’ పాటలు హిట్‌గా నిలిచాయి. ఈ సినిమా బాలూకు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు తెచ్చి పెట్టింది. సింగీతం దర్శకత్వంలోనే ‘ఊరంతా సంక్రాంతి’ సినిమాకు పాటలు చేశారు బాలు. ప్రతి సంక్రాంతికి వినిపించే ‘సంబరాల సంకురాత్రి’ పాట ఈ సినిమాలోదే. శోభన్‌బాబు ‘కొంగుముడి’, బాలకృష్ణ ‘రాము’, నాగార్జున ‘జైత్రయాత్ర’ సినిమాలకు బాలూ సంగీతం అందించారు. జైత్రయాత్రలోని ‘ఎన్నాళ్లమ్మా ఎన్నేళ్లమ్మా’ పాట హిట్‌గా నిలిచింది.

దర్శకుడు వంశీతో ‘లాయర్‌ సుహాసిని’ చేశారు బాలు. ఇందులోని పాటలన్నీ మెలొడీతో ఉంటాయి. ‘తొలిసారి పూసే మురిపాల తీవ’, ‘ఏమైంది ఇల్లాలుగారు’, ‘మహరాజా మర్యాద’ చాలా బాగుంటాయి. ఇక చిన్న సినిమా ‘కళ్లు’కు పెద్ద సంగీతం అందించారు బాలు. ఇందులో ‘తెల్లారింది లెగండోయ్‌’ పాటను ఆ పాట రాసిన సిరివెన్నెల చేత పాడించారు. బాలు  పాటల్లోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా ఒక మార్క్‌ ఉండేలా చూసుకున్నారు. ఆయన పాటల్లో ‘కలకాలం ఇదే పాడనీ’ (ఏజంట్‌ గోపీ), ‘చెలి సఖీ మనోహరి’ (బంగారు చిలక), ‘ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం’ (మగధీరుడు), ‘తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ’ (చిన్నోడు పెద్దోడు) గుర్తుకు వస్తాయి.
‘నా షరతులతో పాటలు చేయడానికి అంగీకరించిన వారికే పాటలు చేస్తాను’ అని చెప్పిన బాలు 1990ల తర్వాత సంగీత దర్శకత్వానికి దూరంగానే ఉండిపోయారు.

బాలు – జానకి
నిరంతరమూ వసంతములే
బాలు నెల్లూరు బిడ్డ అయితే ఎస్‌. జానకి నెల్లూరు కోడలు. ఇద్దరూ పోటీ పడి పాడిన పాటలు తెలుగువారికి కండశర్కరలుగా మారాయి. ముఖ్యంగా ఇళయరాజా తెలుగులో చేసిన పాటలు చాలా వాటికి వీరిద్దరే గొంతునిచ్చారు. ఆ పాటలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ‘మాటే మంత్రము’ (సీతాకోక చిలుక), ‘ఏమని నే చెలి పాడుదును’ (మంత్రిగారి వియ్యంకుడు), ‘నిరంతరము వసంతములే’ (ప్రేమించు–పెళ్లాడు), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘మౌనమేలనోయి’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’ (స్వాతిముత్యం), ‘ఎదలో తొలి వలపే’ (ఎర్ర గులాబీలు), ‘సన్నజాజి పడక మంచె కాడ పడక’ (క్షత్రియపుత్రుడు), ‘మధుర మురళి హృదయ రవళి’ (ఒక రాధ–ఇద్దరు కృష్ణులు)... ఇవన్నీ కమనీయ పాటలు.

ఇక ఇతర సంగీత దర్శకుల కోసం కూడా వీరు ఎన్నో మనోహరమైన పాటలు పాడారు. ‘వీణ వేణువైన సరిగమ’ (ఇంటింటి రామాయణం), ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ‘నీ చేతులలో తలదాల్చి’ (కార్తీక దీపం), ‘అలివేణి ఆణిముత్యమా’ (ముద్దముందారం), ‘కాస్తందుకో దరఖాస్తందుకో’ (రెండు రెళ్లు ఆరు)... ఈ పాటలు వింటుంటే కాలం తెలుస్తుందా? జానకి దగ్గర బాలూకు కొంచెం చనువు ఉండేది. ‘ఆమె ఒక చేతిలో కర్చిఫ్‌ పట్టుకుని పాడేవారు. అది ఆమె అలవాటు. తీరా రికార్డింగ్‌ సమయానికి ఆ కర్చిఫ్‌ దాచేసేవాణ్ణి. ఆమె నన్ను కోప్పడేవారు’ అని సరదాగా చెప్పుకున్నారు బాలు. పాట నుంచి విరమించుకుని విశ్రాంత జీవితం గడుపుతున్న జానకి ఈ వార్త విని ఎలా స్పందిస్తారో. అసలు తట్టుకోగలరో లేదో.

మరిన్ని వార్తలు