జంగిల్‌ బుక్‌ కంటే ముందే మోగ్లీ పుట్టాడని తెలుసా?

18 Jul, 2021 14:54 IST|Sakshi

అదో దట్టమైన అడవి, అందులో..
మోగ్లీ అనే కుర్రాడి సాహసాలు చూసి ‘శెభాష్‌’ అనుకుంటాం 
షేర్‌ ఖాన్‌ క్రూరత్వం చూసి ‘కోపం’తో రగిలిపోతాం. 
తోడేలు తల్లి బాధకి గుండె కరిగిపోతుంది. 
భగీర గొప్ప మనసుకి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం. 
భల్లూ  అల్లరి వేషాలకు నవ్వకుండా ఉండలేం. 
చివరికి అడవిని కాపాడటానికి ఏనుగులు చేసే ప్రయత్నం అదుర్స్‌ అనిపించకమానదు.
పిల్లల నుంచి పెద్దల దాకా.. ముఖ్యంగా నైంటీస్‌ జనరేషన్‌కి అదొక ఫేవరెట్‌ సబ్జెక్ట్‌.. అదే జంగిల్‌ బుక్‌. 
ఆదివారం వచ్చిందంటే దిగ్గజ రచయిత  గుల్జార్‌ రాసిన ‘జంగిల్‌ జంగిల్‌ బాత్‌ చలీ హై..’ లౌడ్‌ సౌండ్‌తో మారుమోగేది. 
అంతలా ఆదరించబట్టే.. ఈ కల్పిత గాథకి రూపం ఏదైనా ఆదరణ మాత్రం తగ్గట్లేదు. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: చిన్నతనంలో పెద్దపులి దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అవుతాడు ఓ చిన్నారి. ఆ పెద్దపులి బారినపడకుండా తోడేళ్లు ఆ పిల్లాడిని  కాపాడుతుంటాయి.  చివరికి ఆ పిల్లాడే పులిని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది. సింపుల్‌గా ఇది రుడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ కథ. ఈ కథ మొత్తం జంతువుల ప్రవర్తన నేపథ్యంలో సాగుతుంది. అయితే, అంతర్లీనంగా ఉన్న థీమ్‌ వేరు. డార్విన్‌ ‘మనుగడ’ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ.. మనిషి–జంతువుల మధ్య సంబంధాలను చూపించాడు. అదే విధంగా చట్టం–న్యాయం, అధికారానికి గౌరవం ఇవ్వడం, విధేయత, శాంతి స్థాపన, అడవుల నరికివేత, అడవి– ఊరు అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సంఘర్షణ... ఇలాంటి  విషయాలెన్నో చర్చించాడు. ప్రకృతిపై మనిషి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో అనే పాయింట్‌ విమర్శకులకు సైతం బాగా నచ్చింది.

అసలు కథ... 
షేర్‌ ఖాన్‌ అనే పెద్దపులి ఆ అడవికి రాజు.  ఒకరోజు ఫారెస్ట్‌ అధికారుల క్యాంపెయిన్‌పై దాడిచేసి అధికారిని, అతని భార్యను చంపేస్తుంది. ఆపై అధికారి కొడుకుని చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ, తోడేళ్ల రాజు ఆ పిల్లాడిని రక్షిస్తుంది. మోగ్లీ అని పేరు పెట్టి తోడేళ్ల మందలో కలిపేస్తుంది. అంతే కాకుండా తమ సరిహద్దుల్లో ఉన్నప్పుడు మోగ్లీపై దాడి చేయకూడదని షేర్‌ ఖాన్‌కి నిబంధన పెడతాయి. చిన్నతనంలో ఓ రోజు ఆడుకుంటూ మోగ్లీ సరిహద్దు దాటుతాడు. షేర్‌ ఖాన్‌ మోగ్లీని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, తోడేలు రాజు తన ప్రాణాలు పణంగా పెట్టి మోగ్లీని కాపాడుతుంది. తర్వాత రక్ష(ఆడ తోడేలు) మోగ్లీ తల్లిగా తన పిల్లలతో పెంచుకుంటుంది.  భగీర(నల్ల చిరుత) మోగ్లీకి చెట్లు ఎక్కడం, వేటాడటంపై శిక్షణ ఇస్తుంది. భల్లు(ఎలుగు బంటి) తోడేళ్లకు విద్యాబుద్ధులు, అడవి చట్టాల్ని బోధిస్తుంటుంది. ఈ ఇద్దరి శిక్షణలో మోగ్లీ రాటు దేలతాడు. తర్వాత కొన్నేళ్లకు అనివార్య పరిస్థితుల్లో మోగ్లీ అడవి దాటాల్సి వస్తుంది. అప్పుడు షేర్‌ ఖాన్‌ మోగ్లీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, నిప్పుని ఆయుధంగా చేసుకుని మోగ్లీ తప్పించుకుంటాడు. 

పొరుగున ఉన్న ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఓ జంట మోగ్లీని దత్తత తీసుకుంటుంది. చిన్నతనంలో ఆ జంట బిడ్డని కూడా పులి ఎత్తుకుపోతుంది. మోగ్లీ పశువుల్ని కాస్తుంటాడు. అయితే, ఈ విషయం షేర్‌ ఖాన్‌కి తెలుస్తుంది. తోడేళ్ల మందలోని వేగుల సాయంతో మోగ్లీ చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ, మోగ్లీ అగ్గి సాయంతో షేర్‌ ఖాన్‌ని చంపేస్తాడు. అయితే ఊళ్లోవాళ్లు మాత్రం మోగ్లీని మంత్రగాడిగా అనుమానించి.. వెళ్లగొడతారు. దీంతో మోగ్లీ తిరిగి అడవికి చేరి తన తోడేలు కుటుంబంతో హాయిగా నివసిస్తుంటాడు. ఇది మొదటి పుస్తకం కథ.

రెండో పుస్తకంలో జంగిల్‌ బుక్‌ సీక్వెల్‌.  అప్పటికే ఆ ఊరి గ్రామస్తులు అడవిని నాశనం చేస్తుంటారు. అదే సమయంలో కరువుతో గ్రామస్తులు చనిపోతుంటారు. అయితే, మోగ్లీ  చేతబడి చేయటంతోనే తమ ప్రాణాలు పోతున్నాయని ప్రజలంతా నమ్ముతారు. మోగ్లీ్కి   ఆశ్రయం ఇచ్చారన్న కారణంతో ఆ జంటను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం స్నేహితురాలి ద్వారా మోగ్లీ తెలుసుకుంటాడు. వెంటనే మోగ్లీ జంతువులతో ఊరిపై దాడి చేయించి వారిని రక్షిస్తాడు. ఇది ఆసరాగా చేసుకుని ఎర్ర తోడేళ్లు మనుషులపై   దాడి చేయాలనుకుంటాయి. కానీ, మోగ్లీ తన తోడేలు కుటుంబం సాయంతో ప్రజల్ని రక్షిస్తాడు. మోగ్లీ మానవత్వానికి కరిగిపోయిన అతని తల్లి.. మనుషులతో ఉండాలా? జంతువులతో అడవిలోనే నివసించాలా? అన్న నిర్ణయాన్ని మోగ్లీకే వదిలేస్తుంది. అలా మోగ్లీ ఆలోచిస్తుండగానే కథ ముగుస్తుంది. అయితే తర్వాత రుడ్‌ యార్డ్‌ కిప్లింగ్‌ రాసిన ‘ది స్పింగ్‌ రన్నింగ్‌’ పుస్తకంలోనూ మోగ్లీ సంఘర్షణకు ముగింపు ఇవ్వకపోవటం విశేషం.

జంగిల్‌ బుక్‌ పుట్టుక
నిజానికి జంగిల్‌ బుక్ కథ కంటే ముందే కీలక పాత్ర మోగ్లీ పుట్టింది. ఇంగ్లండ్‌ ఆర్టిస్ట్‌ జాన్‌ లాక్‌వుడ్‌ కిప్లింగ్‌. భారత దేశ చరిత్రపై కొన్నాళ్ల పాటు అధ్యయనం చేశాడు. ఆ సమయంలో భారత్‌లో పర్యటించిన ఆయన..  మోగ్లీ, మరికొన్ని  పాత్రలను స్కెచ్‌ వేశాడు. మోగ్లీ అంటే కప్ప అని అర్థం. ఆ తర్వాత లాక్‌వుడ్‌ కొడుకు రుడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ ఆ క్యారెక్టర్‌లతోనే జంగిల్‌ బుక్ రచన మొదలుపెట్టాడు. రుడ్‌యార్డ్‌ ముంబైలో పుట్టాడు.  మధ్యప్రదేశ్‌(అప్పుడు మధ్యభారతం)లోని సియోని ప్రాంతంలోని ‘పెంచ్‌’ అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఓ ఇంగ్లిష్‌ ఫారెస్ట్‌ అధికారికి సహకరించే గిరిజన చిన్నారే మోగ్లీ. అలా చిన్న చిన్న కథలు రాశాడు. ఆ కథలన్నింటినీ సంపుటిగా చేసి ‘ఇన్‌ ది రుఖ్‌’ పేరిట సంకలనం చేశాడు. ఆ మరుసటి ఏడాది అంటే 1894లో ది జంగిల్‌ బుక్‌గా పుస్తకం అచ్చయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోగ్లీ–షేర్‌ ఖాన్‌ కథ ఆ పుస్తకంలోనిదే. ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంతో ముడిపెట్టి రెండో పుస్తకం రాశాడు రుడ్‌యార్డ్‌. ఈ  రెండు పుస్తకాల్ని కలిపి 1907లో ఒకే పుస్తకంగా అచ్చేయించాడు. 1933లో అది కాస్త ‘ఆల్‌ ది మోగ్లీ స్టోరీస్‌’ పేరుతో ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది రచయితలు, దర్శకులు తమ వర్షన్‌లను జంగిల్‌ బుక్‌కి అన్వయించారు. ఎన్ని కథలోచ్చినా ఆ క్రెడిట్‌ మాత్రం కిప్లింగ్‌కే కట్టబెడుతుంటారు.

తెరపై భారీ విజయాలు
జంగిల్‌ బుక్‌ మీద యానిమేటెడ్‌ సిరీస్‌లు.. చిత్రాలు బోలెడన్ని వచ్చాయి. అవన్నీ బంపర్‌ హిట్లే. జపాన్‌కు చెందిన నిప్పోన్‌, డోరో టీవీ మర్చండైజింగ్‌ స్టూడియోలు సంయుక్తంగా జంగిల్‌ బుక్‌–షోనెన్‌ మోగ్లీని 52 ఎపిసోడ్లతో కార్టూన్‌గా తెరకెక్కించాయి. దానిని భారత్‌లో ది జంగిల్‌ బుక్‌: ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ మోగ్లీ గా అనువదించారు. భారత్‌లో 90వ దశకంలో ఊపు ఊపిన యానిమేటెడ్‌ సిరీస్‌ అదే. తర్వాత వీడియో గేమ్‌గా జంగిల్‌ బుక్‌ ఆదరణ పొందింది. ఇవన్నీ ఒక ఎత్తయితే జాన్‌ ఫావ్‌రూ డైరెక్షన్‌లో 2016లో రిలీజ్ అయిన ది జంగిల్‌ బుక్‌ చిత్రం.

వాల్ట్‌ డిస్నీ బ్యానర్‌లో 3డీ లైవ్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం యానిమేటెడ్‌ చిత్రాల చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాలో ఒకే ఒక్క హ్యుమన్‌ క్యారెక్టర్‌. ‘మోగ్లీ’ పాత్రలో ఏషియన్‌–అమెరికన్‌ సంతతికి చెందిన నీల్‌ సేథి నటించాడు. సంకల్ప్‌ వాయుపుత్ర అనే కుర్రాడు తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌లో మోగ్లీ పాత్రకి డబ్బింగ్‌ చెప్పాడు. బిలియన్‌ డాలర్లు వసూలు చేసిన తొలి యానిమేటెడ్‌ చిత్రంగా నిలిచింది. భారత్‌లోనూ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు