తమన్నా ‘నవంబర్‌ స్టోరీ’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

22 May, 2021 00:00 IST|Sakshi

రివ్యూ టైమ్‌

సిరీస్‌: ‘నవంబర్‌ స్టోరీ’;
తారాగణం: తమన్నా, పశుపతి;
రచన – దర్శకత్వం: ఇంద్రా సుబ్రమణియన్‌;
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్‌ – హాట్‌స్టార్‌.

తెలుగు వెబ్‌ సిరీస్‌ ‘లెవన్త్‌ అవర్‌’లో కార్పొరేట్‌ లేడీగా ఇటీవల కనిపించిన స్టార్‌ హీరోయిన్‌ తమన్నా లేటెస్ట్‌ తమిళ సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీ’. క్రైమ్‌ స్టోరీ రైటరే ఓ క్రైమ్‌ లో ఇరుక్కుంటే? ఈ ఇతివృత్తంతో ప్రసిద్ధ తమిళ మేగజైన్‌ ‘ఆనంద వికటన్‌’ నిర్మించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. 

కథేమిటంటే..:  దేశంలోనే పేరుపడ్డ క్రైమ్‌ నవలా రచయిత గణేశన్‌ (జి.ఎం. కుమార్‌). ఆయన కూతురు అనూరాధ (తమన్నా). అన్నీ మర్చిపోయే అల్జీమర్స్‌ వ్యాధి తండ్రికి మొదలై, ముదురుతోందని తెలుస్తుంది. వైద్యానికి డబ్బు కోసం పాత ఇల్లొకటి అమ్మేయాలనుకుంటుంది హీరోయిన్‌. అల్జీమర్స్‌ తో జ్ఞాపకాలన్నీ చెరిగిపోక ముందే మరొక్క నవల రాయాలని  కూతుర్ని సాయం అడుగుతాడా తండ్రి. 

మరోపక్క స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలోని పోలీసు కేసుల ఎఫ్‌.ఐ.ఆర్‌లన్నీ డిజిటలైజ్‌ చేసి, సర్వర్‌లో అప్‌లోడ్‌ చేసే పనిలో ఉంటారు హీరోయిన్, ఆమె స్నేహితుడు (వివేక్‌ ప్రసన్న). ఆ సమయంలోనే ఆ సర్వర్‌ లో ఓ ఫోల్డర్‌ హ్యాక్‌ అవుతుంది. ఆ గందరగోళంలో ఉండగానే, ఓ సాయంత్రం లోకల్‌ ట్రైన్‌లో హీరోయిన్‌కు ఎదురైన ఓ స్త్రీ... తాము అమ్మదలుచుకున్న పాత ఇంట్లో హత్యకు గురవుతుంది. హతురాలి పక్కనే ఉన్న తండ్రిని ఆ కేసు నుంచి తప్పించాలని హీరోయిన్‌ ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో పక్కింటి పోస్ట్‌మార్టమ్‌ డాక్టర్‌ యేసు (పశుపతి) సహా చాలా పాత్రలు కథలోకి వస్తాయి. 

హత్య జరిగింది, హ్యాక్‌ చేసింది, హ్యాక్‌ అయిన ఫోల్డర్, ఏటా హీరోయిన్‌ తండ్రి ఆ ఇంటికి వెళ్ళే రోజు – అన్నీ నవంబర్‌ 16 అనే తేదీతో ముడిపడి ఉంటాయి. వాటికీ, ఆ తేదీకీ ఏమిటి సంబంధం? అసలా హతురాలెవరు? హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? రచయిత రాద్దామనుకొన్న ఆ ఆఖరి క్రైమ్‌ నవలకూ, వీటికీ ఏమిటి సంబంధం? ఒక నిజం కోసం అన్వేషణ మొదలుపెడితే బయటపడే ఎన్నో నిజాల సమాహారం ‘నవంబర్‌ స్టోరీ’. 


ఎలా చేశారంటే..:  తండ్రిని కాపాడుకోవడం కోసం శతవిధాల పోరాడే, ఈ ఎథికల్‌ హ్యాకర్‌ కూతురి పాత్ర బాగుంది. సినిమా పద్ధతి అలవాటైన తమన్నా కొన్నిచోట్ల పవర్‌ఫుల్‌ అమ్మాయిగా కనిపిస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేయాలో పాలుపోని బేలగా అనిపిస్తారు. వెబ్‌ సిరీస్‌ కావడం వల్ల, కథానాయిక పాత్రతో పాటు చుట్టుపక్కలి పాత్రలకూ కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ అండ్‌ టైమ్‌ దొరికాయి. హీరోయిన్‌ తండ్రి అయిన క్రైమ్‌ నవలా రచయిత గణేశన్, పోలీస్‌ ఎస్సై సుడలై (అరుళ్‌ దాస్‌) లాంటి పాత్రలతో వీక్షకులకు అనుకోకుండానే ఒక బంధం ఏర్పడుతుంది. పోస్ట్‌ మార్టమ్‌ డాక్టర్‌గా పశుపతి ఆ పాత్రను పండించారు. 

ఎలా తీశారంటే..: కెమెరా వర్క్, షాట్‌ కటింగ్, రీరికార్డింగ్, కథను ముక్కలు ముక్కలుగా సమాంతరంగా నడిపే పద్ధతితో ఈ సిరీస్‌ ఆకర్షిస్తుంది. నిడివి కోసం కథనం నిదానించినప్పటికీ, అనేక లాజిక్కులు మిస్సయినప్పటికీ, ఆసక్తి నిలిచేలా రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి 4 – 5 ఎపిసోడ్లు. ఆ తరువాతే కథ, కథనం కుంటుతాయి. చాలా పాత్రలకూ, వాటి ప్రవర్తనలకూ ఓ సంతృప్తికరమైన ముగింపు లేకపోవడం ఈ సిరీస్‌లో లోపం. ఇంట్లో గోడకున్న అమ్మ ఫోటో మీద డేట్‌ ఆఖరిదాకా హీరోయిన్‌ చూడకపోవడం లాంటివి ఓ పట్టాన మింగుడుపడవు. పైగా, తెరపై వినిపించీ వినిపించని డైలాగు, కనిపించీ కనిపించని దృశ్యాలను పజిల్‌లా కలుపుకొని, ప్రేక్షకులే నిర్ధారణకు రావాలని దర్శక – రచయితలు భావించినట్టు అనిపిస్తుంది. అది కొంత మెదడుకు మేత కావచ్చేమో కానీ, ఏ ఒక్క లంకె అందకపోయినా అనేక లూజ్‌ ఎండ్స్‌ ఉన్నాయని అసంతృప్తి కలుగుతుంది. చివరకు అదే మిగులుతుంది. అది ఈ సిరీస్‌కు మరో సమస్య. 

‘డిస్నీ ప్లస్‌ – హాట్‌స్టార్‌’లో లేటెస్ట్‌ రిలీజ్‌ ‘నవంబర్‌ స్టోరీ’ నిజానికి తమిళ వెబ్‌ సిరీస్‌. తమిళంలో చూడగలిగితే బెస్ట్‌. లేదంటే, లక్షణంగా తెలుగు, హిందీల్లో డబ్బింగ్‌ డైలాగులతోనూ చూసేయచ్చు. శవాలు, సవివరంగా సాగే పోస్ట్‌మార్టమ్‌లు, కాన్పులు, కత్తిపోట్ల లాంటివి కథలో ఉన్నాయి కాబట్టి, పిల్లలతో కాకుండా ఇది పెద్దలకు మాత్రమే ఓకె. సస్పెన్స్‌ ముడులు చివరలో విప్పిన తీరులో లోటుపాట్లను పక్కనపెడితే, నిర్మాణ విలువలు – సాంకేతిక నైపుణ్యంతో ఈ సిరీస్‌ లాక్‌డౌన్‌ కాలక్షేపం. సస్పెన్స్, క్రైమ్‌ మిస్టరీలు చూసేవారు... ఈ 7 ఎపిసోడ్లనూ పాజ్‌ చేయకుండా పాస్‌ చేసేస్తారు. రచన, దర్శకత్వం చేసిన రామ్‌ అలియాస్‌ ఇంద్రా సుబ్రమణియన్‌ను అభినందిస్తారు.

బలాలు:  ∙సస్పెన్స్‌ నిండిన కథాంశం సంగీతం, సౌండ్‌ డిజైన్, కెమెరా వర్క్‌ ∙నిర్మాణ విలువలు 

బలహీనతలు: ∙అసంపూర్తి అంశాలు, పాత్రలు ∙క్లైమాక్స్‌ ఎపిసోడ్లలో తడబాటు ∙మిస్సయిన లాజిక్‌లు, పాత్రల ప్రవర్తన 

కొసమెరుపు: ముగింపులో తడబడ్డ క్రై మ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ స్టోరీ!     
 

– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు