Tamil Hero Babu Death: అప్పుడు వారి మాట విని ఉంటే.. కోలీవుడ్‌ను ఏలేవాడేమో!

20 Sep, 2023 07:34 IST|Sakshi

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దాదాపు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన హీరో కన్నుమూశారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన తమిళ హీరో బాబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 1990లో వచ్చిన 'ఎన్​ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం చేశారు. కాగా, ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయన మరణం పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

బాబు సినీ ప్రస్థానం!

1990ల్లో 'ఎన్​ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత 'పెరుంపుల్లి', 'తాయమ్మ', 'పొన్నుకు చేతి వందచు' చిత్రాల్లో హీరోగా నటించారు. పల్లెటూరి కథలు తనకు బాగా వర్కవుట్ అవుతాయని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్న తరుణంలో తన ఐదవ చిత్రం ‘మనసారా పరిహితంగానే’ చిత్రంలో నటించారు. ఆ సినిమానే బాబు జీవితాన్ని ఒక్కసారిగా మలుపుతిప్పింది. షూటింగ్ సమయంలోనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.  

ఆ ఫైట్ సీన్‌ వల్లే!

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. సన్నివేశంలో హీరో నేలపై నుంచి దూకాలి. నిజంగానే జంపింగ్ చేస్తానని బాబు చెప్పడంతో యూనిట్ అందుకు అంగీకరించలేదు. డూప్ పెట్టుకోవచ్చు కదా అని దర్శకుడు చెప్పినా వినకుండా రియలిస్టిక్‌గా ఉంటుందని.. అంటూ బాబు నిజంగానే జంప్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా బాబు ప్రమాదవశాత్తు మరో చోట పడిపోవడంతో వీపుపై బలంగా తగిలి ఎముకలు విరిగిపోయాయి. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ బాబు నిటారుగా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. అతని కుటుంబం చాలా మంది వైద్యులను సంప్రదించి చికిత్స అందించింది. కానీ అవేమీ పని చేయలేదు. 

భారతీరాజా సంతాపం

సెట్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడి 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన బాబు మరణించాడనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అంటూ సంతాపం ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే దర్శకుడు భారతీరాజా బాబును స్వయంగా సందర్శించి వెళ్లిపోయారు.

అయితే ఆ షూటింగ్ సమయంలో బాబు దెబ్బలు తిన్న తర్వాత మరో హీరోతో ‘మనసారా పరిహితంగానే’ సినిమా తీసినట్లు తెలుస్తోంది. బలమైన కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని ఫైట్ సీన్ ముగించింది. బాబుకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఎంజీఆర్, జయలలిత కాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా స్పీకర్‌గా అనేక పదవులను నిర్వహించిన కె. రాజారాం అతని మామ అవుతారు. 
 

మరిన్ని వార్తలు