Upcoming Time Travel Movies: వెండితెరపై కాలచక్రం.. సమయంతో ప్రయాణం చేస్తున్న టాప్‌ హీరోలు

25 Mar, 2024 00:16 IST|Sakshi

వెండితెరపై కాలచక్రం తిరుగుతోంది. ప్రేక్షకలను విభిన్న కాలాలకు తీసుకుని వెళ్లేందుకు కొందరు హీరోలు సిద్ధం అవుతున్నారు... కాలాన్ని కదిలిస్తున్నారు. టైమ్‌ ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇలా వెండితెరపై సమయంతో ప్రయాణం చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.

ఆరువేల సంవత్సరాలు...
ఆరువేల సంవత్సరాల టైమ్‌ లైన్ తో సోషియో ఫ్యాంటసీ అండ్‌ సైన్స్ ఫిక్షన్  థ్రిల్లర్‌ మూవీ ‘కల్కి 2898ఏడీ’ కథనం సాగుతుందని తెలుస్తోంది. ‘‘ఈ సినిమా కథ మహాభారతం కాలంలో మొదలై, 2898తో పూర్తవుతుంది. అందుకే ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం’’ అని ఈ చిత్రదర్శకుడు నాగ్‌ అశ్విన్  ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ టైమ్‌ ట్రావెల్‌ ఫిల్మ్‌ అని కన్ఫార్మ్‌ చేసుకోవచ్చు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్ , కమల్‌హాసన్  ఇతర లీడ్‌ రోల్స్‌లో కనిపిస్తారు.

రాజమౌళి, మలయాళ నటి అన్నా బెన్ , దుల్కర్‌ సల్మాన్ , విజయ్‌ దేవరకొండ అతిథి పాత్రల్లో కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్‌ కనిపిస్తారని తెలిసింది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్  సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898ఏడీ’ సినిమాను మే 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఐదువందల సంవత్సరాలు...
టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో సూర్య కెరీర్‌లో రూపొందిన చిత్రం ‘24’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్  మూవీ 2016లో విడుదలై హిట్‌ సాధించింది. ఈ జానర్‌లోనే తాజాగా సూర్య నటించిన చిత్రంగా ‘కంగువ’ను చెప్పుకోవచ్చు. ఐదువందల (1700 – 2023) సంవత్సరాల టైమ్‌ పీరియడ్‌లో ఈ చిత్ర కథనం సాగుతుంది.

పద్దెనిమిదో శతాబ్దంలో తాను మొదలుపెట్టిన ఓ పనిని పూర్తి చేయలేక మరణించిన ఓ వీరుడు... పునర్జన్మలో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తాడు? అన్నదే ‘కంగువ’ సినిమా కథనం అని కోలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించగా, హీరోయిన్ గా దిశా పటానీ, ఓ కీలక పాత్రలో యోగిబాబు, విలన్ గా బాబీ డియోల్‌ కనిపిస్తారు. స్టూడియోగ్రీన్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందని తెలిసింది.

మూడు తరాల నేపథ్యంలో...
మలయాళ నటుడు టొవినో థామస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. ఈ సినిమాలో మణియన్ , అజయన్ , కుంజికేలు.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తున్నారు టొవినో థామస్‌. పాత్రలకు తగ్గట్లే కథ కూడా మూడు తరాల హీరోల నేపథ్యంలో సాగుతుంది. కథ రీత్యా మూడు తరాల్లోనూ హీరోగా టొవినో థామస్‌నే కనిపిస్తారని తెలుస్తోంది. ఇలా మూడు డిఫరెంట్‌ టైమ్‌ లైన్స్లో టైమ్‌ ట్రావెల్‌గా ఈ సినిమా కథనం సాగుతుంది.

కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభిలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జితిన్  లాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కృతీ శెట్టికి ఇది తొలి మలయాళ చిత్రం. మ్యాజిక్‌ ఫ్రేమ్స్, యూజీఎమ్‌ ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. త్రీడీలోనూ  రిలీజ్‌ చేయాలని ఈ చిత్రం మేకర్స్‌ ప్లాన్  చేస్తున్నారని మాలీవుడ్‌ సమాచారం.

ఆధునిక అశ్వత్థామ
మహాభారతంలో అమరవీరుడిగా చెప్పుకునే అశ్వత్థామ ఇప్పటి ఆధునిక యుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సినిమా‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్‌’. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు సచిన్  రవి ఈ సినిమాకు దర్శకుడు. కాగా ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌తోనే ఉంటుందని బాలీవుడ్‌ సమాచారం. జాకీ భగ్నానీ, వసుభగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

ఇలా టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers