ప్రముఖ టాలీవుడ్ సినీ రచయితపై కేసు నమోదు..!

13 Jan, 2024 08:52 IST|Sakshi

సినీ మాటల రచయిత రాజసింహపై కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కథల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదమే కారణమని తెలుస్తోంది. రాజాసింహ తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు వివేకానంద ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన ప్రతిష్టను అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం  పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. 

అసలు రాజాసింహ ఎవరు?

ఇదిలా ఉండగా.. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పని చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్‌తో దర్శకుడిగా మారిన రాజసింహ.. యంగ్‌ హీరో సందీప్ కిషన్‌తో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం లేదు. 

>
మరిన్ని వార్తలు