Nanda Kishor: బిగ్‌బాస్ సిరితో గొడవ.. సినిమా డిజాస్టర్‌.. స్పందించిన నందకిశోర్

10 Jan, 2024 10:42 IST|Sakshi

టాలీవుడ్‌లో బుల్లితెర అభిమానులకు గుర్తుండిపోయే పేరు నందకిశోర్. 2001లో మా టీవీలో ప్రసారమైన అత్తగారు కొత్త కోడలు అనే సీరియల్‌లో కానిస్టేబుల్‌గా నటించే బుల్లితెరపై తన కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత వెలుగు నీడలు అనే సీరియల్‌లో విలన్‌గా నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై సూర్యవంశం సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. అంతే కాకుండా జెమినీ టీవీలో ప్రసారమైన స్రవంతి సీరియల్‌లో నటించాడు. ఈ సీరియల్‌ ద్వారా ఆయనకు గుర్తింపు వచ్చింది.  

ఆ తర్వాత నంద కిశోర్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేఖ, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్‌లో నటించారు. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్‌ చేశారు. నితిన్‌ మూవీ ద్రోణలోనూ మంచి రోల్ చేశారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన ఉప్పెన సీరియల్‌లో నటిస్తున్నారు. అంతే కాకుండా స్రవంతి పార్ట్-2 స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. నంద కిశోర్ సీరియల్స్‌లో పాటు సినిమాల్లోనూ చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన నంద కిశోర్ తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సొంతంగా సినిమా తీశాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా యాంకర్‌ సిరి హనుమంతుతో గొడవపై కూడా స్పందించారు. ఇంతకీ ఆ వివరాలేంటో చూద్దాం. 

బుల్లితెర‌పై ప‌లు సీరియ‌ల్స్‌లో సంద‌డి చేసిన ఈ న‌టుడు 'న‌ర‌సింహ‌పురం' సినిమా చేశాడు. 2021 జూలైలో రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంతగా మెప్పించ‌లేక‌పోయింది. ఈ చిత్రంలో సిరి హనుమంతు హీరోయిన్‌గా నటించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే సినిమా కొవిడ్ టైంలో రిలీజ్‌ కావడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదని నందకిశోర్ అన్నారు. అయితే ఈ మూవీ ఓ అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. దాదాపు రూ.కోటి రూపాయల వరకు అప్పులైనట్లు పేర్కొన్నారు.

ఆ సినిమా డిజాస్టర్‌.. ఎందుకంటే?

నందకిశోర్ మాట్లాడుతూ.. 'టీవీ ఇండస్ట్రీలో సక్సెస్‌పుల్‌ అంటే యాంకర్స్ మాత్రమే. టెలివిజన్‌లో చేయాలంటే మనం కొన్ని రోజులు కేటాయించాలి. నరసింహపురం సినిమా విషయంలో పొరపాటు జరిగింది. అయితే నేను సినిమా విషయంలో ఫుల్‌గా ప్రిపేర్ అవ్వలేదు. అందువల్లే కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. అది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఎవరీ సపోర్ట్ లేకుండా మేము సినిమా తీశాం. మాకు మూడేళ్లు పట్టింది. కరోనా సెకండ్‌వేవ్‌ కావడంతో ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. నా సొంత సంపాదన, అప్పులు తెచ్చి సినిమా తీశా. నాకున్న ప్యాషన్‌తో ఏదో చేయాలనిపించింది. ఆ సినిమా కోసం ఒరిజినల్‌గా గుండు కూడా కొట్టించుకున్నా. కానీ అది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా అప్పులకు వడ్డీలు కడుతున్నా.' అని తెలిపారు. 

సిరి హనుమంతుతో గొడవ..

సిరితో గొడవపై మాట్లాడుతూ.. 'నేను సిరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ కొన్ని ఛానెల్స్ వేరేగా రాసి ఉండొచ్చు, తాను చాలా బాగా చేసింది. సిరికి మంచి టాలెంట్ ఉంది. అయితే మేము ఆమె అనుకున్నంత డబ్బులు ఇవ్వలేకపోయాం. సిరి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. చాలా మంచి అమ్మాయి.. మంచి యాక్టర్‌ కూడా' అని అన్నారు. కాగా.. నరసింహపురం సినిమాలో యాంకర్‌, వైజాగ్ అమ్మాయి సిరి హనుమంతు హీరోయిన్‌గా నటించింది.  అయితే ఆమె మూవీ ప్ర‌మోష‌న్స్‌కు పిలిచిన‌ప్పుడు తాను రాలేదు.. అంతే తప్ప ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవని అని నందకిశోర్ తెలిపారు. 
 

>
మరిన్ని వార్తలు