Blind Role Movies: మైండ్‌లో ఫిక్స్‌ అయితే 'బ్లైండ్‌'గా చేస్తాం !

3 Jun, 2022 07:56 IST|Sakshi

Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్‌ రోల్స్‌ ఒప్పుకోవాలంటే మెంటల్‌గా ప్రిపేర్‌ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్‌లో ఫిక్సయితే.. బ్లైండ్‌గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్‌ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. 

బిజినెస్‌ డీలింగ్స్‌తో బిజీ కానున్నారు బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌. ఆయన అన్ని  విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్‌. చూపు లేకపోయినా సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌. ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్‌గా రాజ్‌కుమార్‌ రావ్‌  నటించనున్నారు.  అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బ్రెయిన్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్‌ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్‌. ఈ సక్సెస్‌ఫుల్‌ మేన్‌ జీవితంతో దర్శకురాలు తుషార్‌ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. 

మరోవైపు ఓ సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్‌ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్‌ బ్లైండ్‌. మరి.. ఆ సీరియల్‌ కిల్లర్‌ను ఈ బ్లైండ్‌ పోలీసాఫీసర్‌ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్‌ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్‌గా సోనమ్‌కపూర్‌ నటించిన చిత్రం ‘బ్లైండ్‌’. షోమ్‌ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్‌ కొరియన్‌ ఫిల్మ్‌ ‘బ్లైండ్‌’కు రీమేక్‌ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్‌ కపూర్‌ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్‌’ చిత్రం రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. 

అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్‌ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్‌’ సినిమా కోసమే.  2010లో వచ్చిన స్పానిష్‌ థ్రిల్లర్‌ ‘జూలియాస్‌ ఐస్‌’ చిత్రం హిందీలో ‘బ్లర్‌’గా రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్‌’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్‌ చేయనున్నారు హీరోయిన్‌ హీనాఖాన్‌. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్‌ బ్లైండ్‌’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్‌ బ్లైండ్‌’ టైటిల్‌తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో రిలీజ్‌ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్‌ సినిమాకు రహత్‌ కజ్మీ దర్శకుడు. 

రాజ్‌కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్‌లాంటి పాత్రలతో బాక్సాఫీస్‌పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్‌ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. 

మరిన్ని వార్తలు