ఆచార్య షూటింగ్‌: వీడియో తీసిన ఫ్యాన్స్‌!

25 Feb, 2021 12:07 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: మగధీర, బ్రూస్‌లీ, ఖైదీ నంబర్‌ 150 చిత్రాల్లో చిన్న చిన్న సీన్లలో లేదా, పాటల్లోనో స్క్రీన్‌ మీద కనిపించారు చిరంజీవి, రామ్‌చరణ్‌. కానీ తొలిసారిగా ఈ తండ్రీకొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ప్రస్తుతం ఆచార్య యూనిట్‌ రాజమండ్రిలో మకాం వేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్‌లో చరణ్‌పై ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్‌ సైతం పాల్గొన్నారు. షూటింగ్‌ స్పాట్‌కు చేరుకున్న అభిమానులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పోస్ట్‌ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు సమ్మర్‌లో సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఇక్కడ షూటింగ్‌ పూర్తైన వెంటనే మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో మరో షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది ఆచార్య యూనిట్‌. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక‌్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్‌. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో సీన్స్‌ మాత్రమే కాకుండా లెట్స్‌ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్‌ వేస్తారని టాక్‌. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 13న రిలీజ్‌ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పైగా ఈ టీజర్‌కు రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది.

చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు

ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్‌ ఎంట్రీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు