Vishnu Vishal: ఇన్నాళ్లు ఇండియా పేరు గర్వంగా అనిపించలేదా? సెహ్వాగ్‌కు హీరో సూటి ప్రశ్న..

6 Sep, 2023 13:10 IST|Sakshi

ఇండియా.. భారత్‌గా మారబోతుందా? సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే త్వరలోనే అది నిజం కానున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలామంది పేరు మార్పును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరు మార్పును సమర్థించే లిస్ట్‌లో ప్రముఖ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ముందు వరుసలో ఉన్నారు. 

భారత్‌గా పేరు మార్చాలి
'మనకు గర్వకారణంగా అనిపించే పేరు ఒకటి ఉండాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మనమంతా భారతీయులం. ఇండియా అనే పేరు బ్రిటీష్‌ వాళ్లు ఇచ్చారు. దాన్ని త్యజించాల్సిన సమయం వచ్చింది. మన దేశానికి భారత్‌ అనే పేరును ఖరారు చేయాలి. అలాగే వరల్డ్‌ కప్‌లో ఆడే క్రికెటర్ల షర్ట్‌లపై కూడా ఇండియాకు బదులు భారత్‌ అన్న పేరు ఉండేలా చర్యలు తీసుకోవలి' అంటూ బీసీసీఐని కోరారు. ఈ ట్వీట్‌కు కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్‌ కౌంటరిచ్చాడు. 'సర్‌.. మీకు ఇన్నేళ్లుగా ఇండియా అనే పదం గర్వంగా అనిపించలేదా?' అని ప్రశ్నించాడు.

దేనికి ఉపయోగం?
మరో ట్వీట్‌లో షూటింగ్‌ లొకేషన్‌లో ఉన్న ఫోటో షేర్‌ చేస్తూ.. 'అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో నేను చూసిన వింతవార్త ఇదే.. ఇండియా అంటే భారత్‌.. మన దేశాన్ని ఇండియా, భారత్‌గా.. ఇలా రెండు పేర్లతో పిల్చుకుంటూ వచ్చాం.. కానీ ఉన్నట్లుండి భారత్‌ అనే పదాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు?' అని ప్రశ్నించాడు.

నీ గట్స్‌కు హ్యాట్సాఫ్‌
కేరళను కేరళంగా మార్చితే లేనిది.. ఇండియాను భారత్‌గా మార్చితే మాత్రం తప్పవుతుందా? అని నిలదీస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో.. ప్రతిపక్షం ఇండియా అనే కూటమిగా ఏర్పడింది కాబట్టే ప్రభుత్వం తట్టుకోలేక భారత్‌ అని పేరు మారుస్తోందంటున్నారు. ఏదేమైనా ఈ అంశంపై సోషల్‌ మీడియా వేదికగా గళం వినిపించావంటే నువ్వు గ్రేట్‌ అని కొనియాడుతున్నారు అభిమానులు.

చదవండి: అడల్ట్‌ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్‌

మరిన్ని వార్తలు