ఈకేవైసీ తప్పనిసరి..

28 Sep, 2023 16:04 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌: రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆహార భద్రతా కార్డుల్లో అనర్హుల పేర్లను తొలగించి నిజమైన పేదలకే రేషన్‌ సరుకులు అందేలా కృషిచేస్తోంది. దీనికోసం ఈకేవైసీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కార్డులో పేరు ఉన్న కుటుంబీకులంతా రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత కొన్నేళ్లుగా రేషన్‌కార్డులకు సంబంధించి తనిఖీలు చేయకపోవడంతో కొన్నిచోట్ల అనర్హులకు, చనిపోయిన వారి పేరుపై కూడా రేషన్‌ సరుకులు అందుతున్నాయి. దీంతో రేషన్‌ కార్డులో ఉన్న ప్రతిఒక్కరూ ఈకేవైసీ నమోదు చేయించుకుంటే అర్హులు, చనిపోయిన వారి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జిల్లాలో రేషన్‌ డీలర్లు ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. రేషన్‌ డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్‌ మిషన్‌ల ద్వారా డీలర్లు ఈకేవైసీ చేస్తున్నారు.

ఇలా చేసుకోవాలి..
రేషన్‌ కార్డులో పేరున్న కుటుంబీకులంతా చౌకధర దుకాణానికి వెళ్లి ఈ–పాస్‌ మిషన్‌లో వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేయగానే లబ్ధిదారుడి ఆధార్‌ నంబర్‌ వస్తుంది. మిషన్‌లో గ్రీన్‌లైన్‌ వస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు.. రెడ్‌లైన్‌ వస్తే రేషన్‌ కార్డులో పేరున్న వ్యక్తి ఆధార్‌ మ్యాచ్‌ కాలేదని ఈకేవైసీ రిజక్ట్‌ అవుతుంది. అలాంటి వారి పేర్లను రేషన్‌ కార్డు నుంచి తొలగిస్తారు. ఇందుకోసం కార్డులో పేరున్న వ్యక్తులంతా రేషన్‌ దుకాణానికి వెళ్లి వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు వెళ్లకున్నా వారిని రేషన్‌ కార్డు నుంచి తొలగిస్తారు.

జిల్లా పరిధిలో ఇలా..
జిల్లాలో ప్రస్తుతం 2,38,052 రేషన్‌ కార్డులు ఉండగా.. ఇందులో 18,621 అంత్యోదయ కార్డులు, 40 అన్నపూర్ణ, సాధారణ రేషన్‌ కార్డులు 2,19,272 కార్డులు ఉన్నారు. అంత్యోదయ కార్డు ఉన్న వారికి కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి 10 కిలోలు ఉచితంగా ఇస్తున్నారు. జిల్లాలో ఉన్న రేషన్‌ కార్డు లబ్ధిదారుల కోసం నెలకు 4,861 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. ఈ విషయమై పెద్దగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రభుత్వంతోపాటు.. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అ వగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లబ్ధిదారులు 7,52,628

మొత్తం రేషన్‌ కార్డులు 2,38,052

ఇంకా చేయాల్సింది 6,27,089

ఈకేవైసీ పూర్తిచేసిన వారు : 1,25,539

అవగాహన కల్పిస్తాం..

కుటుంబ యజమానితోపాటు రేషన్‌ కార్డులో పేరున్న ప్రతిఒక్కరూ వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేయించుకోవాలి. రేషన్‌ షాపుల్లోనే ఈ–పాస్‌ మిషన్‌ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అనర్హులను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌ కార్డు నుంచి పేర్లు తొలగిస్తాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేలా చూస్తాం.

స్వామికుమార్‌, డీఎస్‌ఓ

మరిన్ని వార్తలు