రైతుపై ఎస్‌ఐ దాడి.. తర్వాత తొందరపాటు అంటూ క్షమాపనలు!

1 Dec, 2023 11:58 IST|Sakshi
ఎస్‌ఐ దాడిలో గాయపడిన కృష్ణ

మునగాల(కోదాడ): మండలంలోని నర్సింహాపురంలో గురువారం ఓ రైతుపై చిలుకూరు ఎస్‌ఐ దాడి చేసి గాయపర్చాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింహాపురం గ్రాామానికి చెందిన రైతు పుల్లూరు కృష్ణ (ఐదవ వార్డు సభ్యుడు) తన వరిపొలం కోసి ధాన్యాన్ని గ్రామంలో ఉన్న పుల్లూరి వెంకటనారాయణ –అరుణ కళావేదిక ఆవరణలో ఆరబోసి కాపలగా ఉన్నాడు.

ఎన్నికల విధుల్లో ఉన్న చిలుకూరు ఎస్‌ఐ చల్లా శ్రీనివాస్‌యాదవ్‌ గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను చెదరగొట్టాడు. అనంతరం ధాన్యానికి కాపలాగా ఉన్న రైతు కృష్ణ వద్దకు వచ్చి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లాలని ఆదేశించాడు. దీంతో సదరు రైతు ధాన్యం వద్ద కాపాలా ఉన్నాను అని సమాధానం ఇవ్వడంతో ఎస్‌ఐ దౌర్జన్యంగా దూరంగా పో అంటూ కాలర్‌ పాటి కొద్ది దూరం లాక్కొని వెళ్లాడు.

తనపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని ప్రశ్నించిన రైతుపై ఎస్‌ఐ మరోసారి దాడి చేయడంతో మోకాళ్లకు గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు సదరు ఎస్‌ఐని చుట్టుముట్టి అకారణంగా ఓ రైతుపై ఎందుకు దౌర్జన్యం చేశావని ఎదురుతిరిగారు. దీంతో ఎస్‌ఐ నేను తొందరపడ్డాను క్షమించండి అంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.

అకారణంగా రైతుపై దాడిచేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోదాడ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విషయాన్నికాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎన్‌.పద్మావతి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె రైతును ఫోన్‌లో పరామర్శించి సదరు ఎస్‌ఐపై చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు