ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలి

11 Nov, 2023 01:28 IST|Sakshi
మాట్లాడుతున్న జనరల్‌ అబ్జర్వర్‌ బీపీ చౌహన్‌

నారాయణపేట: క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు అన్ని టీంలు బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా జనరల్‌ అబ్జర్వర్‌ బీపీ చౌహన్‌ తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో నోడల్‌ అధికారులు, కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నోడల్‌ అధికారులు తనిఖీ సమయంలో రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బును తరలిస్తూ పట్టుబడ్డా డబ్బును పంచనామా చేసి ఎస్‌హెచ్‌ఓకు అందజేయాలన్నారు. రాత్రి తనిఖీల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్న కంట్రోల్‌ రూంను సంప్రదించాలని, డబ్బు పట్టుబడ్డ సమయంలో, ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించినా వీడియో కవరేజ్‌ చేయాలన్నారు. సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం, సమావేశాలకు ఆర్‌ఓ ఇచ్చిన వివరాలు తమ దగ్గర ఉండాలన్నారు. ఎస్‌ఎస్‌టీ, ఎఫెస్‌టీ టీంల విధులను వారికి వివరించారు. ఎన్నికల నిబంధనలకు ప్రతి ఒక్కరు తప్పక పాటించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలన్నారు. సమావేశం అనంతరం కంట్రోల్‌ రూమ్‌ 1950 మీడియా సెంటర్‌ తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే సి విజిల్‌ యాప్‌ను, ఎన్నికల సామగ్రి పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు