Sakshi News home page

విద్యారంగానికి పెద్దపీట వేయాలి

Published Sat, Nov 11 2023 1:28 AM

మాట్లాడుతున్న రామకృష్ణ  - Sakshi

నారాయణపేట రూరల్‌: విద్యారంగానికి సముచిత స్థానం కల్పించే పార్టీకే విద్యార్థులు, యువత మద్దతు ఇవ్వాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పెద్దింటి రామకృష్ణ, ఆజాద్‌ అన్నారు. పట్టణంలోని భగత్‌సింగ్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రెండవ రోజు పీడీఎస్‌యూ జిల్లా బాడీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలో స్పష్టం చేయాలని, 20శాతం నిధులు కేటాయించి ఏటా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా హామీ ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయని, కార్పొరేట్‌ శక్తుల కోసం ఎర్ర తివాచి పరుస్తున్నాయని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విదానం సరైనది కాదని, పూర్తిగా కాశాయీకరణ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. విద్యార్థులు లేరనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తున్నారని, ఉపాధ్యాయ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తల్లడిల్లుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడ టీచర్లు లేక, కనీసం వలంటీర్ల నియామకం లేక చదువు కుంటుబడుతుందని దుయ్యబట్టారు. మౌళిక సదుపాయాలు, స్కావింజర్లు ఏర్పాటు చేయకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారని విమర్శించారు. జిల్లాకు పీజీ సెంటర్‌, మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు సాయికుమార్‌, కార్యదర్శి అజయ్‌, భాస్కర్‌, హన్మంతు, శ్రీహరి, బాలు, గౌస్‌, అనిత, రాధిక, అనూష, మనీష పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement