కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్‌

3 Jun, 2021 16:44 IST|Sakshi

ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏ‍ళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్‌పూర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరోడ్‌ గ్రామంలో ఉన్న జిల్లా పరిషద్‌ పాఠశాలను కొద్ది రోజల క్రితం కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ ఐసోలేషన్‌ సెంటర్‌లో 15 మంది కోవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లు ఉన్నారు.

కాగా మే 29న ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్వహణ ఎలా ఉందో చూడడానికి డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ వస్తున్నట్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సంగ్రామ్‌పూర్‌ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు ఇన్‌స్పెక్షన్‌ నేపథ్యంలో పాఠశాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయితే పనిచేయడానికి  పారిశుధ్య కార్మికులు రాకపోవడంతో సెంటర్‌ నిర్వాహకుడు.. ఊరిలో బంధువులను చూడడానికి వచ్చిన 8 ఏళ్ల చిన్నారిని బలవంతంగా పాఠశాలకు తీసుకెళ్లాడు.

కరోనా పేషంట్ల మరుగుదొడ్లను శుభ్రం చేయాలని.. లేకపోతే కట్టెతో కొడతానని బెదిరించాడు.దీంతో భయపడిన ఆ చిన్నారి మరుగుదొడ్లను ఏడుస్తూనే శుభ్రం చేశాడు. పని పూర్తయ్యాకా 50 రూపాయలు ఆ పిల్లాడి చేతిలో పెట్టి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడినుంచి పంపిచేశాడు. కాగా దీనిని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పిల్లాడు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటే నిర్వాహకుడు అతనికి మరాఠిలో సూచనలు ఇవ్వడం కనిపించింది. విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తిని విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పజెప్పారు. కాగా పోలీసులు ఆ వ్యక్తిపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు.
చదవండి: కరోనా సెకండ్‌ వేవ్‌: 624 మంది డాక్టర్లు మృతి

మరిన్ని వార్తలు