ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత

4 Dec, 2023 15:18 IST|Sakshi

ఢిల్లీ: ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు. 

తన సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఛైర్మన్ ధంఖర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు. "సుప్రీంకోర్టు జోక్యంతో నాపై విధించిన సస్పెన్షన్​ను రద్దు అయింది. నన్ను 115 రోజుల పాటు సస్పెండ్​ చేశారు. ఆ సమయంలో ప్రజల గొంతును సభలో వినిపించలేకపోయాను. రాజ్యసభ ఛైర్మన్​కు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను" అని వీడియో సందేశంలో చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీ (సవరణ) బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. 

ఇదీ చదవండి: Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం..

>
మరిన్ని వార్తలు