MP Election Results: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం..

4 Dec, 2023 14:11 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 230 స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ 163 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న కాంగ్రెస్‌ పార్టీ 66 సీట్లకే పరిమితమైంది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌కు అయితే ఈ ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులలో చాలా మంది ఓటమిని చవిచూశారు. ఆయన సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌, మేనల్లుడు ప్రియవ్రత్‌ సింగ్‌ సహా చాలా మంది బంధువులు వారి వారి నియోజకవర్గాల్లో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కొడుకు జైవర్ధన్‌ సింగ్‌ మాత్రమే రఘోఘర్‌ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక దిగ్విజయ్‌ మద్దతుదారులు అనేక మంది ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా లహర్‌ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ గోవింద్‌ సింగ్‌, రౌ నియోజకవర్గం జీతూ పట్వారీ ఓటమిపాలయ్యారు.

ఎన్నికల ఫలితాలకు ముందు దిగ్విజయ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ గెలుపు పట్ల చాలా విశ్వాసంగా కనిపించారు. శివరాజ్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ఎలాగైనా గణనీయమైన స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోవాలని భావించినా ప్రజలు భిన్న తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలో అత్యంత సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్‌ సింగ్‌కు ప్రస్తుత ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయనే చెప్పుకోవాలి.

>
మరిన్ని వార్తలు