70 ఏళ్లు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలి

20 Jun, 2021 08:07 IST|Sakshi

సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నందున కోవిడ్‌ మహమ్మారి దృష్ట్యా 70 ఏళ్ల పైబడిన వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మధ్యంతర బెయిల్‌ లేదా అత్యవసర పెరోల్‌పై విడుదల చేయాలన్నారు. ఇందుకోసం ఏకీకృత విధానాన్ని రూపొందించాలన్నారు. దేశంలోని జైళ్లలోని ఖైదీల్లో 50 ఏళ్లు, ఆపై వయస్సు వారు 19.1% మంది ఉన్నట్లు నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయన్నారు.

విచారణ ఖైదీల్లో 50 ఏళ్లు ఆపైని వారు 10.7% వరకు ఉండగా మొత్తం ఖైదీల్లో 50 ఏళ్లు పైబడిన వారు 63,336(13.2%) ఉన్నారని చెప్పారు. వీరిలో 70 ఏళ్లు, ఆపైబడిన వారు మహారాష్ట్ర, మణిపూర్, లక్షద్వీప్‌ మినహాయించి 5,163 మంది అని వివరించారు. గుజరాత్, రాజస్తాన్‌లలోని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారనీ, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. అక్కడి జైళ్లలో 70 ఏళ్ల పైబడిన సుమారు 180 మంది ఖైదీలున్నారన్నారు. వృద్ధ ఖైదీలను వారిపై ఉన్న ఆరోపణలతో సంబంధం లేకుండా వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని మేథా పాట్కర్‌ విజ్ఞప్తి చేశారు.

చదవండి: కారులో 260 బంగారు బిస్కెట్లు.. తీయడానికి 18 గంటలు  

మరిన్ని వార్తలు