ఆపదలో ఉన్నాను.. ఆదుకోవాలని రిక్వెస్టులు.. ఆపై

20 Jun, 2021 08:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వీరఘట్టం : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మన పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి స్నేహితులకు మెసేజ్‌లు పెడుతున్నారు. అత్యవసరంగా డబ్బులు కావాలని అభ్యర్థనలు పెడుతూ చాకచాక్యంగా డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలామంది ఇలా సైబర్‌ నేరాల బారిన పడినా పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. తాజాగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు చెందిన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌కు గురికావడంతో ఆయన అందరినీ అప్రమత్తం చేశారు. 

  • తాను ఆపదలో ఉన్నానని, వెంటనే డబ్బులు పంపించాలని వీరఘట్టంకు చెందిన టీవీ మెకానిక్‌ ఉగిరి వెంకట రమాప్రసాద్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఆయన స్నేహితులకు ఇటీవల మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే స్పందించిన వడ్డి ప్రవీణ్‌ అనే స్నేహితుడు రమాప్రసాద్‌ అకౌంట్‌కు రూ.5 వేలు ఫోన్‌ పే చేశారు. డబ్బులు పంపించానని, ఒక్కసారి చెక్‌ చూసుకో అని రమాప్రసాద్‌కు చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. పూర్తిగా ఆరా తీస్తే తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని గుర్తించారు. వెంటనే తన మిత్రులను అప్రమత్తం చేసి ఎవరూ డబ్బులు పంపించవద్దని మెసేజ్‌లు పెట్టారు. అంతకుముందు తన మిత్రుడు ప్రవీణ్‌కు వెళ్లిన ఫేక్‌ ఖాతా సైబీరియా దేశానికి చెందినదని విచారణలో తేలింది. 
  • జిల్లాకు చెందిన ఓ సీఐ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచిరెండు రోజులుగా అతనికి తెలిసిన వాళ్లందరికీ డబ్బులు కావాలని మెసేజ్‌లు రావడంతో అందరూ అప్రమత్తమై సీఐకి సమాచారం ఇచ్చారు. ఎవరో తప్పుడు సమాచారం పంపించినట్లు తన మిత్రులకు చెప్పారు. 
  • తాజాగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను సైబర్‌ కేటుగాళ్లు హ్యాక్‌ చేసినట్లు ఎమ్మెల్యే స్వయంగా తెలిపారు. ఇటీవల ఈ తరహా మోసాలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.  

అంతా మెసేజ్‌లతోనే..  
ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫ్రెండ్స్‌ ఉన్నవారు, ఎక్కువ లైక్‌లు వస్తున్న వారిని సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు, డాక్టర్లు, రిపోర్టర్లు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలను ఎంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నానని, వైద్యం కోసం నగదు అత్యవసరమంటూ, డబ్బులు పంపించాలని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇది నిజమని నమ్మి కొందరు డబ్బులు పంపించి తర్వాత విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. మెసేజ్‌లు పంపే సమయంలో సైబర్‌ నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు అడిగితే అనుమానం వస్తుందని భావించి  రూ.5 వేలు, రూ.10 వేలు కావాలని అభ్యర్థునలు పెడుతున్నారు. ఈ తరహా మోసాలు ఎక్కువగా బ్యాంకాక్, సైబీరియా, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల నుంచి జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి.... 
నగదు బదిలీల కోసం రిక్వెస్టులు వెళుతున్నాయా లేదా అనేది ఎప్పటికపుడు గమనించుకోవాలి. నకిలీ ప్రొఫైల్‌ తెరిచినట్లు అనుమానం వస్తే వెంటనే ‘నా ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యింది. నా పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగినా, ఇతర సమాచారం అడిగిన స్పందించవద్దు’ అని మెసేజ్‌లు పెట్టాలి. మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను లాక్‌లో పెట్టుకోవడంతో పాటు స్నేహితులకు తప్ప ఇతరులకు అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్తలు పడాలి. నకిలీ ఖాతా అయితే ప్రొఫైల్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి ‘ప్రీటెండ్‌ టు బి సమ్‌ వన్‌’అని నొక్కాలి. అక్కడ ‘మి’ అని ప్రెస్‌ చేసి తర్వాత రిపోర్టులో కన్ఫర్మేషన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత రిపోర్టు, నెక్ట్స్, డన్‌ చేయాలి. 

ఫిర్యాదు చేయండి.. 
ఫేస్‌బుక్‌ ఖాతాల హ్యాక్‌పై జిల్లాలో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటువంటి సైబర్‌ నేరాలు జిల్లాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందితో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధంగా ఎవరికైనా మోసం జరిగితే సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి సైబర్‌ నేరగాళ్ల పనిపడతాం. 
– అమిత్‌బర్దార్, ఎస్పీ  

డబ్బులు పంపొద్దు 
రణస్థలం : ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ వినియోగిస్తున్న ఫేస్‌బుక్‌ ఆకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం హ్యాక్‌ చేశారని కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ అకౌంట్‌ పేరుతో డబ్బులు అడుగుతున్నారని, ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు.    

మరిన్ని వార్తలు