షాకింగ్‌: కోవిడ్‌ నిబంధనలు గాలికొదిలి 300 మంది పరార్‌

22 Apr, 2021 17:58 IST|Sakshi

విమానాశ్రయం నుంచి ఉడాయించిన 300మంది ప్రయాణికులు

కరోనా నిబంధనలు ఉల్లఘించిన వీరిపై క్రిమినల్‌ చర్యలు: అధికారులు

గువహటి:  ఒకవైపు దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు రేపుతోంది. మరోవైవు అసోంలోని  సిల్చార్  విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తప్పనిసరిగా కోవిడ్‌ టెస్ట్‌ చేయించు కోవాల్సిన విమాన ప్రయాణికులు అధికారుల కళ్లుగప్పి దొడ్డి దారిన ఉడాయించారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు  కాదు ఏకంగా 300 మంది ప్రయాణికులు పరారయ్యారు.  నిబంధనలను గాలికి ఒదిలి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన  ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కాచర్ జిల్లా అధికారులు సీరియస్‌గా స్పందించారు. విమాన ప్రయాణికులందరి వివరాలను సేకరిస్తున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ సత్తవన్  వెల్లడించారు. (వ్యాక్సిన్‌ తరువాత పాజిటివ్‌ : ఐసీఎంఆర్‌ సంచలన రిపోర్టు)

అసోంలోని సిల్చార్ ఎయిర్‌పోర్టుకు  నిన్న(బుధవారం, ఏప్రిల్‌ 21) మొత్తం ఆరు విమానాలు చేరుకున్నాయి. ఇలా వచ్చిన మొత్తం 690 మంది ప్రయాణికుల్లో 189 మంది మాత్రమే కరోనా టెస్టులు చేయించు కున్నారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్ రావడం గమనార్హం. ఇందులో కొందరు రాష్ట్రంలోని గువహతి నుంచి రావడం, మరికొందరు ఇతరు ఈశాన్య రాష్ట్రాల(ట్రాన్సిట్)కు ప్రయాణిస్తున్నవారున్నారు. ఈ నేపథ్యంలో 200 మందికి పైగా ప్రయాణికులను పరీక్షించాల్సిన అవసరం లేదని విమానాశ్రయం, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలును ఉల్లంఘించి 300 మందికి పైగా ప్రయాణికులు టెస్టులు చేయించుకోకుండా తప్పించుకున్నారని  అధికారులు వెల్లడించారు.  సంబంధిత ప్రయాణికుల వివరాలన్నీ తమ దగ్గర ఉన్న నేపథ్యంలో తొందరలోనే వీరి వివరాలు సేకరిస్తామని చెప్పారు.

కాగా  కరోనా  ఉధృతి  నేపథ్యంలో  అసోం ప్రభుత్వం మునుపటి నిబంధనలను పాక్షికంగా సవరించి, కోవిడ్ పరీక్ష ఫలితం ప్రతికూలంగా  వచ్చినప్పటికీ, విమానాలు,  రైళ్ల ద్వారా అసోంకు వచ్చే వారికి  7 రోజుల గృహ నిర్బంధాన్ని తప్పనిసరి చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ అధికారులు, అత్యవసర వైద్యంకోసం ప్రయాణించేవారు, ఇతర ఈశాన్య రాష్ట్రాల పౌరులు, తీవ్ర అనారోగ్యంతో  బాధపడుతున్నవారికి దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది.

చదవండి :  జొమాటో కొత్త  ఫీచర్‌, దయచేసి మిస్‌ యూజ్‌ చేయకండి!
ఎన్నిసార్లు గెలుస్తావ్‌ భయ్యా..! నెటిజన్లు ఫిదా

మరిన్ని వార్తలు