శతమానం భారతి: లక్ష్యం 2047 మన తయారీ

5 Jul, 2022 16:54 IST|Sakshi

భారత్‌లో చిప్‌ డిజైనర్‌లకు కొదవ లేదు. అలాగని చిప్‌లు తయారు చేసే సంస్థలు విస్తృతంగానూ లేవు. విద్యుత్‌ ఉప కరణాలను విజ్ఞతతో పనిచేయించే కీలకమైన అర్ధవాహకాలే (సెమీకండక్టర్‌) చిప్‌లు. కంప్యూటర్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు, గేమింగ్‌ సాఫ్ట్‌వేర్, శాటిలైట్స్, వైద్య సామగ్రి.. ఒకటేమిటి, దైనందిన జీవితాలను దాదాపుగా మొత్తం ఈ చిప్‌లే వెనకుండి నడిపిస్తున్నాయి. చిప్‌ తయారీ కర్మాగారాలను ‘ఫ్యాబ్రికేషన్‌ ఫౌండ్రీలు’ అంటారు. వాడుకలో ‘ఫ్యాబ్స్‌’. భారత్‌కు సొంత ఫ్యాబ్స్‌ లేవంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 1984లో 5000 నానో మీటర్ల ప్రాసెస్‌ సామర్థ్యంతో మొదలైన ఎస్‌íసీఎల్‌ కేవలం ఏడాదీ రెండేళ్లలో 800 నానో మీటర్ల అదనపు ప్రాసెస్‌ టెక్నాలజీని సాధించ గలిగింది.

దురదృష్టం... 1989లో కాంప్లెక్స్‌ మొత్తం అగ్ని ప్రమాదంలో బుగ్గిపాలైంది. ఇస్రో దానిని పునరుద్ధరించ గలిగింది గానీ, పునరుజ్జీవింప జేయలేక పోయింది. భారత్‌లో ఇప్పుడు ఫ్యాబ్‌ల ఏర్పాటుకు పరిస్థితులు మెరుగయ్యాయనే చెప్పాలి. నాణ్యమైన విద్యుత్తు, నీరు, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలను భారత్‌ నమ్మకంగా అందించగలదు. అయితే అందించగలనన్న నమ్మకం కలిగించాలి. స్టార్టప్‌లను ఆకర్షించాలి. 

‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా ఫ్యాబ్‌ నిర్మాణం కోసం గత డిసెంబరులో ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’... పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచింది. చిప్‌ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీఎస్‌ఎంసీ (తైవాన్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ)తో కలిసి, టాటా గ్రూప్‌ ఒక ఫ్యాబ్‌ను నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ‘సన్‌రైజ్‌ కేటగిరీ’ కింద ప్రభుత్వం కేటాయించిన రూ. 7.5 లక్షల కోట్లలో ఫ్యాబ్‌లకూ వాటా ఉంది కనుక ఒక కొత్త ఫ్యాబ్‌ కోసం మనం నమ్మకంగా ఎదురు చూడవచ్చు.

మరిన్ని వార్తలు