Modi Magic: 17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్‌!

4 Dec, 2023 07:42 IST|Sakshi

దేశంలో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయభేరీ మోగించింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 164 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో రాజస్థాన్ తన చరిత్రను పునరావృతం చేసి, అధికారాన్ని మార్చుకుంది. ఇక్కడ బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. 

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ అంటే 90 సీట్లలో 54 గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాలు లోక్‌సభ ఎన్నికలకు కీలకమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ఈ రాష్ట్రాలు చాలా కీలకమైనవి. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించాక 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా కొన్నింటిలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. కాగా మహారాష్ట్ర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, పుదుచ్చేరిలలో మిత్రపక్షాలతో చేయికలిపింది.

దేశ రాజకీయ మ్యాప్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం దేశంలోని 57 శాతానికి పైగా ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలోని 78 శాతం ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018లో బీజేపీ పలు ఓటములను ఎదుర్కొంది. మొదట కర్ణాటకలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను చాటుకుంది. 

అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల పరంపర కొనసాగింది. 2019 నాటికి బీజేపీ 34శాతం రాజకీయ విస్తీర్ణానికి తగ్గింది. బీజేపీ పాలన కేవలం 44 శాతం జనాభాపై మాత్రమే ఉంది. అయితే ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించడంతో పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగింది. ఈ విజయాలను మోదీ మ్యాజిక్‌ అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: తగ్గిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య..20కే పరిమితం!

>
మరిన్ని వార్తలు