పాఠశాలకు సరుకుల బదులు పశువుల దాణా..!

21 Mar, 2021 11:02 IST|Sakshi

పుణె: సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్రలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పుణెలోని ఒక మున్సిపల్‌ పాఠశాలకు మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా  పశువుల దాణాను సరఫరా చేశారు. ఈ ఘటన గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలకు సరుకులకు బదులు పశువుల దాణా వచ్చింది. దీంతో కంగుతిన్న పాఠశాల సిబ్బంది స్థానిక నాయకులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు పంపిన పశువుల దాణాను స్వాధీనం చేసుకున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు .. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కాగా, 58 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల పుణె మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నేరుగా మిడ్‌ డే మీల్స్ సరుకులను  విద్యార్థుల ఇంటికి చేరవేయాలని కార్పోరేషన్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరుకుల రవాణాలో పొరపాట్ల మూలంగా తాజా ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై పుణె నగర మేయర్‌ మాట్లాడుతూ.. ‘కార్పోరేషన్‌ పాఠశాల విద్యార్థులకు మిడ్‌ డే మీల్స్‌ వస్తువులను సరఫరా చేయడమే మా బాధ్యత. పాఠశాలకు పశువుల దాణాను పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. 
(చదవండి: పుణేలో కోవిడ్‌ ఆంక్షలు)

మరిన్ని వార్తలు