వ్యాక్సిన్ల కొరత: రూ.4500 కోట్లు విడుదల

19 Apr, 2021 18:54 IST|Sakshi

వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం

సీరం, భారత్‌ బయోటెక్‌కు భారీగా నిధులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి నమోదవుతున్న కేసులు సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనాలు వ్యాక్సిన్‌ కోసం క్యూ కడుతున్నారు. అయితే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టీకా డోసులు అయిపోయాయి. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచ‌డానికి సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్‌ల‌కు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణ‌యంచింది. ఈ మేర‌కు ఆర్థిక శాఖ సోమ‌వారం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో 3 వేల కోట్ల‌ రూపాయలను సీర‌మ్‌కు, 1,500 కోట్ల‌ రూపాయలను భార‌త్ బ‌యోటెక్‌కు ఇవ్వ‌నున్నట్లు సమాచారం. 

నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్‌ ఉత్ప‌త్తి చేయ‌డానికి త‌మ‌కు 3 వేల కోట్ల రూపాయలు అవ‌స‌ర‌మ‌ని సీర‌మ్ సీఈవో అదార్ పూనావాలా కొద్ది రోజుల క్రితమే ప్ర‌భుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచ‌డానికి ఆర్థిక సాయం చేయ‌డంతో పాటు.. వినూత్న విధానాల‌ను క‌నుగొన‌డానికి వ్యాక్సిన్ తయారీదారుల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని పూనావాలా చెప్పారు. జూన్ నెల‌లోగా వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచాల‌ని సీర‌మ్ భావిస్తోంది.

చదవండి: కరోనా వ్యాక్సిన్‌.. వేధించే సందేహాలు.. సమాధానాలు 

మరిన్ని వార్తలు