చార్‌ధామ్‌ యాత్ర: ప్రకృతి ధర్మాన్ని మరచిన భక్తులు.. జీవావ‌ర‌ణానికే పెను ప్రమాదమంటూ వార్నింగ్‌

22 May, 2022 16:27 IST|Sakshi

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్‌ధామ్‌ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈ యాత్రను భారతీయలు ఎంతో పుణ్య‌ప్ర‌దంగా భావిస్తారు. ఈ యాత్ర కోసం భక్తులు ఎంతో ఖర్చు చేసి అక్కడి వెళ్తుంటారు. ఆ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.

కానీ, భక్తులు ఇవ్వన్నీ మరచి.. అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను కలుషితం చేస్తున్నారు. ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తుల్లో కొందరు అక్క‌డి నియ‌మాల‌ను ఏమాత్రం పాటించ‌డం లేదు. ప్లాస్టిట్స్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ బ్యాగులు, చెత్తా చెదారం అన్నీ అక్కడే పడేసి వచ్చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతాన్ని చెత్త కుండీలా మార్చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఫొటోలను షేర్‌ చేశాయి. ఈ క్రమంలో యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి.

ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్లాస్టిక్ కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రం, అక్క‌డి వాతావ‌ర‌ణం విపరీతంగా దెబ్బ‌తిని పోతోంద‌ని నెటిజన్లు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. చార్‌ధామ్ లాంటి సున్నిత ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ కారణంగా లేనిపోని స‌మ‌స్య‌లు తెచ్చుకోవద్దని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు. అది జీవావ‌ర‌ణానికే పెద్ద ప్ర‌మాద‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లో 2013 నాటి ఉప‌ద్ర‌వాన్ని ఒక్క‌సారి అంద‌రూ గుర్తుకు తెచ్చుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. దేవుడిని కేవలం గ‌ర్భగుడిలోనే చూడ‌టం కాదు.. ప్ర‌కృతిలోనూ దైవ‌త్వాన్ని చూడాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: య‌మునోత్రిలో కూలిన ర‌హ‌దారి భద్రత గోడ.. నిలిచిపోయిన 10 వేల మంది యాత్రికులు..

మరిన్ని వార్తలు