స్వచ్ఛతలో 5వ ర్యాంక్‌

12 Jan, 2024 02:56 IST|Sakshi
క్లీన్‌ సిటీ అవార్డు అందుకుంటున్న సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, కమిషనర్‌ సంపత్‌. చిత్రంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ తదితరులు

తెలంగాణకు మొత్తం నాలుగు జాతీయ అవార్డులు 

క్లీన్‌ సిటీ కేటగిరీలో జీహెచ్‌ఎంసీకి 9వ ర్యాంక్‌ 

చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్‌కు 5 స్టార్‌ రేటింగ్‌ 

అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. పరిశుభ్రమైన నగరాలు (క్లీన్‌ సిటీస్‌), అతి పరిశుభ్రమైన (క్లీనెస్ట్‌) కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలు (బెస్ట్‌ పెర్ఫారి్మంగ్‌ స్టేట్స్‌) కేటగిరీలన్నీ కలిపి 110 అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు నాలుగు జాతీయ అవార్డులు లభించగా.. మొత్తం 3,029.32 పాయింట్లతో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది క్లీనెస్ట్‌ సిటీ అవార్డును ఉమ్మడిగా ఇండోర్, సూరత్‌లు గెలుచుకున్నాయి. ఆలిండియా క్లీన్‌ సిటీ కేటగిరీలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) 9వ ర్యాంకును కైవసం చేసుకుంది.  

మరికొన్ని అవార్డులు
లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో తెలంగాణలో క్లీన్‌ సిటీగా గుండ్ల పోచంపల్లి అవార్డు గెలుచుకుంది. 25 వేలు –50 వేలు జనాభా కేటగిరీలో సౌత్‌ జోన్‌లో క్లీన్‌ సిటీగా నిజాంపేట్, 50 వేలు – 1 లక్ష జనాభా కేటగిరీలో సౌత్‌ జోన్‌లో క్లీన్‌ సిటీగా సిద్దిపేట స్థానిక సంస్థలు అవార్డులు కైవసం చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడీఎఫ్‌ కేటగిరీలో 19, ఓడీఎఫ్‌+ కేటగిరీలో 77, ఓడీఎఫ్‌++ కేటగిరీలో 45, వాటర్‌+ కేటగిరీలో 2 స్థానిక సంస్థలు ఉన్నాయి.

చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్‌కు 5 స్టార్‌ రేటింగ్‌ రాగా, సిద్దిపేట, నిజాంపేట్, గుండ్ల పోచంపల్లి, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, పీర్జాదిగూడ, సిరిసిల్ల, భువనగిరి, నార్సింగి స్థానిక సంస్థలకు 1 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీలు అవార్డులను అందజేశారు.

>
మరిన్ని వార్తలు