వాటర్‌ ట్యాంకర్‌పై వధూవరుల ఊరేగింపు.. నో హనీమూన్‌ బ్యానర్‌తో ఆసక్తికరమైన చర్చ

9 Jul, 2022 17:43 IST|Sakshi

ఈరోజుల్లో  వైరల్‌ అయిపోవడం చిటికేసినంత ఈజీ అయిపోయింది. చేసే పని ఎలాంటిదైనా కెమెరాకి చిక్కితే చాలూ అన్నట్లు ఉంది పరిస్థితి. కావాలని కొందరు.. అనుకోకుండా కొందరు మీమ్‌ స్టఫ్‌ అయిపోతున్నారు. అదే సమయంలో చర్చలకు సైతం దారి తీస్తున్నారు మరికొందరు. అలాంటి జంట గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 

వాటర్‌ ట్యాంకర్‌పై వధువు వరుడిని ఊరేగించిన ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి ఇప్పుడు. వీళ్లేదో దేశాన్ని ఉద్దరిస్తున్నారా? అనుకోకండి.. సమస్య మీద పోరాటంలో భాగమే ఈ ఊరేగింపు. మహారాష్ట్ర కోల్హాపూర్‌కు చెందిన విశాల్‌ కోలేకర్‌(32) వివాహం అపర్ణ అనే యువతితో గురువారం జరిగింది. వివాహం తర్వాత ఆ ఇద్దరినీ ఓ వాటర్‌ ట్యాంకర్‌పై ఎక్కించి మరీ ఊరేగించారు బంధువులు. రోడ్లు, వీధుల వెంట వెళ్తున్న ఆ ఊరేగింపును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే వాళ్లు అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 

కరువు.. చాలాచోట్ల సీజన్‌తో సంబంధంలేని సమస్యగా మారిపోయింది. అధికారులు కూడా నీటి కొరత తీర్చడంలో అసమర్థత ప్రదర్శిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తమ ప్రాంతానికి నీటి సరఫరా ఉండట్లేదన్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ జంట ఇలా చేసింది.

‘‘నగరంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మా ఏరియా(మంగళ్‌వార్‌ పేట్‌)లో నెలకొన్న సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ, ఫలితం లేకుండా పోతోంది. ప్రిన్స్‌ క్లబ్‌ అనే సోషల్‌ గ్రూప్‌ తరపున చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాం.. అయినా నీరు సకాలంలో రావట్లేదు. అందుకే చాలా కుటుంబాలు వాటర్‌ ట్యాంకర్‌లనే నమ్ముకున్నాయి’’ అని వరుడు విశాల్‌ కోలేకర్‌ వాపోయాడు.

ఈ నిరసన ఇక్కడితోనే ఆగిపోలేదు. వివాహ ఊరేగింపులో వాటర్‌ ట్యాంకర్‌కు ఓ బ్యానర్‌ కట్టింది ఈ జంట. అందులో నీటి సమస్య తీరేంత వరకు హనీమూన్‌ కూడా వెళ్లమంటూ పేర్కొన్నారు. విశాల్‌తో పాటు అతని ఆశయానికి అండగా నిలిచిన అపర్ణను చాలామంది అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు