Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి

7 Sep, 2022 06:14 IST|Sakshi

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లభించింది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ తయారీ ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఐఎన్‌కోవ్యాక్‌ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్‌ మాండవీయ మంగళవారం ట్వీట్‌ చేశారు.

ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌లలో భారత్‌ బయోటెక్‌ తయారీ వ్యాక్సిన్‌.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ కావడం విశేషం. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్‌ బయోటెక్‌ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్‌ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు