కరోనా గండం గడచినట్టేనా?

25 Sep, 2021 16:32 IST|Sakshi

భారతీయులకు ఓ శుభవార్త! 
18 నెలలుగా పీడిస్తున్న కోవిడ్‌ శని దాదాపు విరగడైనట్లే! 
అక్కడక్కడ.. అడపాదడపా కొన్ని కేసులు నమోదు కావడం మినహా... 
రోజులో లక్షల కేసులు... 
వేల మరణాలను చూసే అవకాశం లేదు! 
ఈ మాట అంటోంది ఎవరో కాదు... 
దేశంలోనే ప్రముఖ వైరాలజిస్టు ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ 
అంతేనా.. ఇక హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చా అంటే...? 
ప్రమాదకరమైన రూపాంతరితం అవతరిస్తే తప్ప! 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన కోవిడ్‌ కేసులు 31 వేల పైచిలుకు. వారం సగటు కూడా దాదాపు ఇంతే. గత ఏడాది మార్చి నుంచి అంటే లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి చూసినా.. ఇప్పుడు దేశం మొత్తమ్మీద ఉన్న కేసుల సంఖ్య ఒక్కశాతం కంటే తక్కువ. ప్రమాదకర కొత్త రూపాంతరితం ఏదీ అవతరించకపోతే ఇకపై రోజుకు లక్షల సంఖ్యలో కేసులు, వేల మరణాలు ఉండకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్, వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ అధ్యాపకురాలైన గగన్‌దీప్‌ కాంగ్‌ స్పష్టంచేశారు.

ఆమె ‘ద వైర్‌’ న్యూస్‌పోర్టల్‌తో మాట్లాడుతూ కోవిడ్‌కు సంబంధించి భారత్‌ మహమ్మారి స్థాయి (పాండెమిక్‌) నుంచి దిగువస్థాయి (ఎండెమిక్‌)కి చేరుతోందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ కూడా ఇటీవల ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయని, ఒకటి, రెండో దశల మాదిరిగా ఉండదని తెలిపారు. వినాయక చవితితో మొదలైన పండుగల సీజన్‌ కారణంగా కోవిడ్‌ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న ఆందోళనల నేపథ్యంలో గగన్‌దీప్‌ కాంగ్‌ మాటలు ఊరటనిచ్చేవే. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... 


జాగరూకతతో ఉండాలి 

దేశంలో డెల్టా రూపాంతరితం విజృంభించి పతాకస్థాయికి చేరిన తరువాత కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నప్పటికీ గత జనవరిలో ఉన్న స్థాయికి చేరలేదని, దీనిపై కొంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లోనూ అత్యధికం కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రల నుంచి మాత్రమే ఉంటున్నాయి. ఇకపైనా ఇదే పద్ధతిలో కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవడం.. మిగిలిన ప్రాంతాల్లో దాదాపు లేకపోవడం అన్న ధోరణి కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల్లోని వైరస్‌ రూపాంతరితాలు, టీకా వేయించుకున్న వారి సంఖ్య, అప్పటికే వ్యాధిబారిన పడ్డ వారి సంఖ్య, మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం తదితర అంశాలపై కేసుల సంఖ్య ఆధారపడుతుంది. (చదవండి: భారత్‌లో కొత్త వేరియంట్‌పై ఆధారాల్లేవు)

ఎంఆర్‌ఎన్‌ఏ వైరస్‌ అయిన కోవిడ్‌ ఇప్పటికీ చాలా వేగంగా జన్యు మార్పులకు గురవుతోంది. ఫలితంగా కొత్త రూపాంతరితం పుట్టుకొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కొత్త రూపాంతరితాలన్నింటితో ప్రమాదం లేకపోయినా.. జరిగిన జన్యు మార్పులను బట్టి కొన్ని రూపాంతరితాలు ప్రమాదకరంగా మారవచ్చు. వైరస్‌ ప్రవర్తనలో అనూహ్య మార్పులేవీ లేకుండా.. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే రెండో దశ మాదిరిగా ఇంకోసారి దేశంలో కోవిడ్‌ విజృంభించే అవకాశం లేకపోలేదు.  


బూస్టర్లు ఇప్పుడు అనవసరం
 
కోవిడ్‌ నిరోధానికి బూస్టర్‌ టీకాలు ఇవ్వాలన్న కొందరి ఆలోచన సరైంది కాదు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరిగా లేని వారికి ఇస్తే ఇవ్వొచ్చు. అయితే ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం కోవిడ్‌–19పై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఇకపై తగ్గించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్‌ కాలంలో మరుగునపడ్డ ఇతర వ్యాధుల చికిత్సపై దృష్టి పెట్టాలి. మూడోదశపై అనవసరమైన ఆందోళనను పక్కనబెట్టి నెలలపాటు చికిత్సకు దూరంగా ఉన్న క్షయ, కేన్సర్‌ తదితర వ్యాధిగ్రస్తుల అవసరాలను పూరించాలి. కోవిడ్‌ పరిచయమైన తొలినాళ్లలో టెస్టింగ్, ట్రేసింగ్‌లకు ప్రాధాన్యం లభించిందని, కోవిడ్‌ నిర్వహణకు అప్పట్లో అది అత్యవసరమైందని, ఇప్పుడా పరిస్థితి లేదు. (ఇంట్లో మృతిచెందినా పరిహారం: కరోనా మృతుల పరిహారంపై మార్గదర్శకాలు)

మరిన్ని వార్తలు