దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా

28 Dec, 2020 12:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌-19 కట్టడికై వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ మహమ్మారి రూపం మార్చుకుని మరోసారి బెంబేలెత్తిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్ అండ్‌ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇక కొత్తరకం వైరస్‌కు ఎన్‌440కె(N440K)గా నామకరణం చేశారు. దీనికి యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో దీని ఉనికిని గుర్తించారు. అదే విధంగా నోయిడాలో కోవిడ్‌​ రీ ఇన్‌ఫెక్షన్‌ కేసు(కొత్తరకం)ను గుర్తించినట్లు సమాచారం. కాగా భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,021 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 279 మంది మృతి చెందారు. (చదవండి: 24 గంటల్లో 279 మంది మృతి)

దీంతో మొత్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరగా.. 1,47,901 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక యూకేలో ఇప్పటికే కొత్త రకం కరోనా వైరస్‌(B.1.1.7) గుర్తించిన విషయం తెలిసిందే. శరవేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ కారణంగా మునుపటి కంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో సైతం మరో రూపంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్‌లో సైతం ఎన్‌440కె రకాన్ని గుర్తించారు. కాగా యూకేలో కొత్తగా 2.2 లక్షల మంది కోవిడ్‌ రోగుల్లోని 6 శాతం మందిలో కొత్త వైరస్‌ లక్షణాలు బయటపడగా.. భారత్‌లోని కోటి మందికి పైగా కరోనా పేషెంట్లలో అతిస్వల్ప సంఖ్యలో (0.05 శాతం) ఈ వైరస్‌ జన్యువులో మార్పులు గుర్తించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు