ఊరట : భారత్‌లో 20 లక్షలు దాటిన రికవరీలు

19 Aug, 2020 15:29 IST|Sakshi

1.91 శాతానికి తగ్గిన మరణాల రేటు

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19పై భారత్‌ పోరాటానికి ఊతమిస్తూ అమెరికా ప్రభుత్వం బుధవారం భారత్‌కు రెండో విడత 100 వెంటిలేటర్లను అందచేసింది. భారత ప్రభుత్వం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీతో సమన్వయం ద్వారా అమెరికా వెంటిలేటర్లను భారత్‌కు అందించిందని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కరోనా వైరస్‌ కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నా వ్యాధి నుంచి రికార్డుస్ధాయిలో రోగులు కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య బుధవారం నాటికి 20 లక్షలు దాటింది.

దీంతో రికవరీ రేటు 73.64 శాతానికి ఎగబాకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాల రేటు సైతం 1.91 శాతానికి తగ్గిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6,76,514 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటివరకూ మహమ్మారి నుంచి 20,37,870 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకూ 3,17,42,782 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్‌ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్ధాయిలో 8,01,518 కరోనా టెస్టులు జరిగాయని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 64,531 తాజా కేసులు వెలుగుచూడగా 1092 మంది మరణించారు. చదవండి : మనకు తొలి వ్యాక్సిన్‌ ఆస్ట్రాజెనెకా నుంచే!

>
మరిన్ని వార్తలు