కోవిషీల్డ్‌తో‌ మెరుగైన ఫలితాలు

20 Nov, 2020 08:27 IST|Sakshi

విదేశీ టీకాలు దేశ పరిస్థితులకు సరిపోవు

ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండ్రోజులకు మించి ఉండదు

మోడెర్నా టీకా ఖరీదు ఎక్కువ ఉండే అవకాశం

సెకండ్‌ వేవ్‌ వచ్చినా విదేశాల కంటే తీవ్రత తక్కువే..

సాక్షి, హైదరాబాద్‌: మన దేశ పరిస్థితులకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ను భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోట్ల సంఖ్యలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో అతిశీతల వ్యవస్థలు తక్కువగా ఉండటంతో ఇతర కంపెనీల టీకాలు సరిగా పనిచేయవని ‘ద వైర్‌.ఇన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గగన్‌దీప్‌ కాంగ్‌ స్పష్టం చేశారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందన్న అంచనాలున్నా వీటిని –70 నుంచి –80 డిగ్రీ సెల్సియస్‌ అతిశీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని, రవాణా సమయంలోనూ ఇది తగ్గరాదని ఆమె వివరించారు. పైగా ఫైజర్‌ టీకా రెండ్రోజుల్లో పనికిరాకుండా పోతుందని గుర్తు చేశారు. ‘మోడెర్నా టీకా నిర్వహణ –20 డిగ్రీ సెల్సియస్‌ స్థాయిలోనే జరుగుతుంది. నెల పాటు ఉపయోగించుకోవచ్చు. కానీ.. ఒక్కో టీకా డోసు ఖరీదు దాదాపు రూ.3,000 వరకు ఉండవచ్చు. ఇంత ఖరీదైన టీకాను మనం భరించలేము..’ అని వెల్లడించారు. ఈ రెండింటితో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా టీకా భారత్‌ పరిస్థితులకు బాగా సరిపోతుందన్నారు. ఈ టీకాను నిల్వ చేసేందుకు–8 నుంచి రెండు డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఈ స్థాయి ఉష్ణోగ్రతలను సాధారణ రిఫ్రిజిరేటర్లతోనే అందించవచ్చని తెలిపారు.

టీకా ముందు ఎవరికి..?
టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి ఇవ్వాలన్న విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని గగన్‌దీప్‌ కాంగ్‌ హెచ్చరించారు. ఆరోగ్యరంగంలో పనిచేసే వారు, పోలీసులు, సైన్యం, 50 ఏళ్ల పైబడిన వారు.. ఇలా ప్రాధాన్యత క్రమంలో టీకాలు ఇవ్వాలని, అయితే వీరిని ఎలా గుర్తిస్తారు? ఏ క్రమంలో టీకా ఇస్తారన్న అంశం కీలకమవుతుందని తెలిపారు. ఆరోగ్య రంగంలో వివిధ రకాలున్నాయని, కోవిడ్‌ రోగులకు దగ్గరగా పనిచేసే వారికి ముందుగా టీకా ఇస్తారా..? ఇది ఇతర ఆరోగ్య సేవలు అందించే వారిపై వివక్ష చూపడం కాదా.. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు, నర్సులకు టీకా ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు? ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు వెతికిన తర్వాతే టీకా పంపిణీ చేపట్టడం మేలని సూచించారు. (చదవండి: సీనియర్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ భళా)

జాగ్రత్తలు తీసుకోకుంటే విజృంభణే..
దేశంలో చలికాలం నేపథ్యంలో మరోసారి కరోనా విజృంభించే (సెకండ్‌ వేవ్‌) అవకాశముందా..? అన్న ప్రశ్నకు గగన్‌దీప్‌ కాంగ్‌ సమాధానమిస్తూ.. తొలి దశ కేసులు క్రమేపీ తగ్గుముఖం పట్టడం ఇప్పుడు చూస్తున్నామని.. తర్వాతి కాలంలో వచ్చే కేసుల తీరు ఎలా ఉంటుందన్నది ప్రజలు తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మాసు్కలు వేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల రెండోసారి కేసులు విజృంభించే అవకాశముందన్నారు. అయితే ఇది యూరప్, అమెరికాల కంటే తక్కువ తీవ్రతతోనే ఉండవచ్చునని చెప్పారు.  

కరోనా వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌..
‘కరోనా టీకాల తయారీ దాదాపు చివరి దశకు వచ్చేసింది.. ప్రపంచం నలుమూలల్లోని పలుదేశాల్లో వేర్వేరు కంపెనీలు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు వెల్లడవుతున్నాయి. తమ టీకా సామర్థ్యం 95 శాతమని ఫైజర్‌ కంపెనీ ప్రకటిస్తే.. మా టీకా ఒక అర శాతం మాత్రమే తక్కువన్నట్టుగా అమెరికన్‌ కంపెనీ మోడెర్నా చెప్పుకుంది. ఈ టీకాలే కాకుండా.. రష్యా, బ్రిటన్, చైనా, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్నవి ఇంకా బోలెడున్నాయి. మరి.. ఇవన్నీ మనదేశంలో వాడొచ్చా అంటే.. వీలుకాకపోవచ్చని’ చెబుతున్నారు దేశంలోనే పేరొందిన వ్యాక్సిన్‌ నిపుణురాలు, శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌..     

మరిన్ని వార్తలు