అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?

4 Jan, 2024 08:20 IST|Sakshi

ముంబయి: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) జనవరి 5న వేలం వేయనుంది. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వికుల ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమితో సహా నాలుగు ఆస్తులు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాపర్టీల ధర రూ. 19.2 లక్షలు. ఇందులో చిన్న ప్లాట్‌ను రూ. 15,440 రిజర్వ్ ధరగా ఉంచారు. అంతకుముందు 2017, 2020లో దావూద్ ఇబ్రహీంకు చెందిన 17 ఆస్తులను SAFEMA వేలం వేసింది. 

"దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీకి చెందిన నాలుగు ఆస్తులను జనవరి 5న వేలం వేస్తున్నాం. ఈ ఆస్తులు మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో వ్యవసాయ భూమి రూపంలో ఉన్నాయి. జనవరి 5న మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 గంటల మధ్య వేలం ప్రక్రియ జరగనుంది" అని SAFEMA ఓ ప్రకటనలో పేర్కొంది. 

దావూద్ ఇబ్రహీం, ఆయన కుటుంబ సభ్యులపై స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో ఈ ఆస్తులు అటాచ్ చేశారు. 2017లో వేలం వేసిన దావూద్ ఆస్తులు రూ.11 కోట్లు పలికాయి. 2020లో, వేలంలో దావూద్ ఆస్తులు రూ. 22.79 లక్షలు పలికాయి.

ఇదీ చదవండి: Lok Sabha Election: తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ?

>
మరిన్ని వార్తలు