ఏపీ, తెలంగాణ వారికి  నెగెటివ్‌ రిపోర్టు అక్కర్లేదు 

15 Jun, 2021 09:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి ఇకపై ఆర్టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు అవసరం లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ఇతరత్రా ప్రయాణ సాధానాల ద్వారా ఢిల్లీ వచ్చే వారికి ఎలాంటి నెగెటివ్‌ రోపోర్టు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మే 19న ఇచ్చిన ఉత్తర్వులు (ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి, 14 రోజుల క్వారంటైన్‌) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను పలు విమానయాన సంస్థలు తమతమ ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేశాయి.

రెండు నెలల తర్వాత రెస్టారెంట్లు
దేశరాజధానిలో సుమారు రెండు నెలల తర్వాత రెస్టారెంట్లు తెరచుకున్నాయి. అన్‌లాక్‌ మార్గదర్శకాల ప్రకారం 50 శాతం సామర్థ్యం, భౌతికదూరం పాటిస్తూ నిర్వాహకులు రెస్టారెంట్లు తెరిచారు. మరోవైపు, ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి. దేశరాజధానిలో గడిచిన 24 గంటల్లో 131 కొత్త కరోనా  కేసులు నమోదు కాగా 16 మంది మృతి చెందారు.

16 నుంచి తెరచుకోనున్న స్మారక కట్టడాలు
ఈ నెల 16 నుంచి స్మారక కట్టడాలు, మ్యూజియంలు తెరవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) అనుమతిసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజ్‌మహల్‌తో పాటు  ఏఎస్‌ఐ సంరక్షణలో ఉన్న 3,693 చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, 50 మ్యూజియంలను బుధవారం నుంచి తెరువనున్నారు. సందర్శకులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఏఎస్‌ఐ తెలిపింది.

చదవండి:  8 గంటల ఫలితం.. దక్కిన ఓ ప్రాణం

మరిన్ని వార్తలు