కరోనా విలయం: చూస్తే కన్నీళ్లాగవు: వైరల్‌ ట్వీట్‌

30 Apr, 2021 17:22 IST|Sakshi

రెండో దశలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

15 గంటల పాటు పీపీఈ కిట్లలో వైద్యుల కష్టాలు 

డా.సోహిల్‌ పోస్ట్‌ వైరల్‌

సాక్షి,ముంబై: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి  అతలాకుతలం చేస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసుల నమోదు, మరణాలతో దేశవాసులను బెంబేలెత్తిస్తోంది. మరోవైపు కరోనా రోగులకు ఆసుపత్రులలో మందులు దొరక్క, ఆక్సిజన్‌ కొరత, సమయానకి బెడ్లు దొరకక అనేమంది రోగులు తమ ఆత్మీయుల ముందే ఊపిరి వదులుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షోభ సమయంలో  ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా కరోనా రోగులను సమీప బంధువులే కనీసం తాకడానికి భయపడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు తెగించి మరీ  లక్షలాది మందికి ప్రాణాలు పోస్తున్నారు. ఈ క్రమంలో అలుపెరుగక పోరాడుతున్నప్పటికీ కరోనా మహమ్మారికి బలవుతున్న రోగులను చూసి కంట తడిపెడుతున్న డాక్లర్లు అనేకమంది ఉన్నారు. మాస్క్‌ , భౌతిక దూరం, శానిటైజేషన్‌ లాంటి కరోనా నిబంధనలు పాటించాలంటూ వేడుకుంటున్న వైద్యులను చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక డాక్టరు పోస్ట్‌ సంచలనంగా మారింది.  (కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్‌)

పీపీఈ కిట్‌లోసుమారు 15 గంటలు నిరంతరం ధరించడం వలన చెమటలో తడిసిపోయిన  ఫోటోలను డాక్టర్ సోహిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అప్పటినుండి వేలాది లైక్‌లు, రీట్వీట్‌లలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి తమ వంతు కృషి చేస్తూ,  వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో ఈ పోస్ట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సోహిల్ పీపీఈ కిట్‌లో ఉన్న ఒక ఫోటోను, పూర్తిగా చెమటతో తడిసి ముద్ద అయిన మరో  ఫోటోను ట్వీట్‌ చేశారు.  "దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది" అని సోహిల్ పేర్కొన్నారు. ‘‘మేం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటూ చాలా కష్టపడుతున్నాం. ఒక్కోసారి పాజిటివ్‌ రోగులకు అడుగు దూరంలో మాత్రమే ఉంటాం. మరోసారి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న పెద్దలకు కేవలం అంగుళం దూరంలో ఉంటాం. అందుకే వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు అందరి తరపున వేడుకుంటున్నా...దయచేసి అందరూ టీకా వేయించుకోండి’’ అంటూ ట్వీట్‌ ద్వారా అభ్యర్థించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇదే ఏకైక పరిష్కారం కనుక ప్రజలందరూ టీకాలు వేయించుకుని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. (రెమిడెసివిర్‌ కొరత: కేంద్రం కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు