Income Tax Department: కాంగ్రెస్‌ ఖాతాల స్తంభన

17 Feb, 2024 05:05 IST|Sakshi

అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించడంతో పునరుద్ధరణ

ప్రజాస్వామ్యంపై దాడి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి.

పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో కాంగ్రెస్‌ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్‌ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్‌ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది.

ట్రిబ్యునల్‌ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్‌ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్‌ చేసిన ఖాతాల్లో యూత్‌ కాంగ్రెస్‌ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు.

అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్‌ అన్నారు.  

భయపడకండి మోదీ జీ: రాహుల్‌
ఈ వ్యవహారంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్‌ ప్రజాశక్తికి కాంగ్రెస్‌ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్‌ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎద్దేవాచేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు