రైతుల ఆందోళనలు.. అవార్డులు తిరిగిచ్చేస్తామన్న క్రీడాకారులు..?

1 Dec, 2020 20:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయంలో నూతన చట్టాలను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆరు రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. ఇంకా ఆందోళనను ఉధృతం చేశారు.

తాజాగా రైతుల ఆందోళనలకు పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు మద్దతు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమకు వచ్చిన అవార్డులు,మెడల్స్ అన్నింటినీ తిరిగిచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన క్రీడాకారులలో రెజ్లర్ మరియు పద్మశ్రీ అవార్డీ కర్తార్ సింగ్, అర్జున అవార్డ్ గ్రహీత మరియు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్, అర్జున అవార్డ్ గ్రహీత హాకీ ఆటగాడు గుర్మైల్ సింగ్, ఒలంపిక్ హాకీ ఆటగాడు, అర్జున అవార్డ్ గ్రహీత సజ్జన్ చీమా, గోల్డెన్ గర్ల్ గా పిలువబడే మాజీ ఇండియన్ హాకీ కెప్టెన్ రజ్బిట్ కౌర్ కూడా ఉన్నారు. మంగళవారం జలంధర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఈ క్రీడాకారులందరూ డిమాండ్ చేశారు.

మరోవైపు, రైతుల ఆందోళనలు విరమించేలా ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో మంగళవారం 36మంది రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మూడవ రౌండ్ చర్చలు ప్రారంభించింది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పంజాబ్ కి చెందిన రైతులు, హర్యానా నుంచి ఇద్దరు రైతు సంఘాల ప్రతినిధులు, ఏఐకేఎస్ సీసీ లీడర్ యోగేంద్ర యాదవ్, ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో నాయకుడు పాల్గొన్నారు. రైతులు ఆందోళనలను విరమింపచేసేలా తగిన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు ఇవాళ ఉదయం టాప్ బీజేపీ లీడర్లు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువరు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేవమై చర్చించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు