Namo Drone Didi Scheme: ‘నమో డ్రోన్ దీదీ’ అంటే ఏమిటి? ఎవరికి ప్రయోజనం?

10 Mar, 2024 07:51 IST|Sakshi

వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. అయితే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ఇది సులభతరంగా మారుతోంది. మరోవైపు వ్యవసాయరంగంలో మహిళల ప్రాధాన్యత పెంచేందుకు ‍ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపధ్యంలో రూపొందినదే ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం.

వ్యవసాయ పనులకు ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం మరింత సహయకారిగా మారింది. ఈ పథకాన్ని దేశంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దీనిని విస్తరించబోతోంది. ఈ  నేపధ్యంలోనే ఈ పథకంలో భాగస్వాములైన 300 మంది మహిళలు మార్చి 11న ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే వారు డ్రోన్‌ను ఎగురవేసే విధానాన్ని కూడా నాటి కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని సోమవారం న్యూఢిల్లీలోని పూసా సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఆరోజు ప్రధాని మోదీ వెయ్యమంది మహిళలకు డ్రోన్‌లను అందజేయనున్నారు. డ్రోన్‌తో పాటు బ్యాటరీతో పనిచేసే వాహనాన్ని కూడా మహిళలకు ఇవ్వనున్నారు. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన కృష్ణ హరికృష్ణ పటేల్ డ్రోన్ దీదీగా పనిచేస్తున్నారు. డ్రోన్ల సాయంతో 45 నిమిషాల్లో వ్యవసాయ పనులు పూర్తి చేయవచ్చని తెలిపారు. డ్రోన్‌ ఆపరేట్ చేస్తూ పంటలను పర్యవేక్షించడం, పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయడం, విత్తనాలు వెదజల్లడం లాంటి పనులు సులభంగా చేయవచ్చని పేర్కొన్నారు. 

ప్రస్తుతం 450 మంది డ్రోన్‌ దీదీలు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వ్యవసాయ కార్యకలాపాలలో తమ సేవలను అందిస్తున్నారు. ఈ ఏడాది వెయ్యి మంది మహిళలను డ్రోన్ దీదీలుగా తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ పైలట్లుగా మారాలనుకుంటున్న గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. లైసెన్స్ పొందిన డ్రోన్ దీదీ ఒక సీజన్‌లో రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 

Election 2024

మరిన్ని వార్తలు