G20 Summit: విదేశీ అతిథుల కోసం అనువాదకులు

8 Sep, 2023 06:28 IST|Sakshi

న్యూఢిల్లీ: జీ20 సదస్సు కోసం వచ్చి ఢిల్లీ దుకాణాల్లో, ముఖ్యంగా చాందినీ చౌక్‌ ప్రాంతంలో షాపింగ్‌ చేసే విదేశీ అతిథుల సౌకర్యం కోసం అక్కడి వర్తకులు మరో అడుగు ముందుకేశారు. షాపింగ్‌ సమయంలో భాషా బేధంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అనువాదకు(ట్రాన్స్‌లేటర్‌)లను సిద్ధంచేస్తున్నారు. ఇంగ్లి‹Ù, ఫ్రెంచ్, స్పానిష్‌ ఇలా జీ20 దేశాల్లో మాట్లాడే భాషలను అనర్గళంగా మాట్లాడి అనువదించగల 100 మంది మహిళా అనువాదకులను అక్కడి వర్తకులు రంగంలోకి దింపుతున్నారు.

వీరు అందుబాటులో ఉండటంతో ఇకమీదట విదేశీ అతిథులు షాపింగ్‌ వేళ ఎలాంటి ఇబ్బందులు పడరని వర్తకులు చెబుతున్నారు. ఈ అనువాదకులు నిజానికి నూతన వ్యాపార వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూవర్స్‌). వీరిలో ఫ్యాషన్‌ డిజైనర్లు, సెలూన్, బొటిక్‌ యజమానులు, బ్లాగర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ‘ వీరంతా ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరు.

8, 9, 10 తేదీల్లో ట్రేడర్లకు, అతిథులకు అనుసంధానకర్తలుగా మెలగుతారు’ అని వీరితో భాగస్వామ్యం కుదుర్చుకున్న ది చాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ(సీటీఐ) చైర్మన్‌ బ్రిజేష్‌ గోయల్‌ చెప్పారు. ‘ ట్రేడర్లకు సాయపడే వాలంటీర్ల జాబితాను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు పంపాం. వీరు విదేశీ అతిథులకు అందుబాటులో ఉండి సాయపడతారు. దేశంలోనే షాపింగ్‌కు చిరునామాగా నిలిచే చాందీనీ చౌక్‌లో విదేశీయుల సందడి మరింత పెరగనుంది’ అని గోయల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు