రోడ్డు ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో..

30 Sep, 2020 15:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌ లాక్‌డౌన్‌లో మే 16వ తేదీ అత్యంత దురదష్టకరమైన రోజు. రాజస్థాన్‌ నుంచి బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 50 మంది వలస కార్మికులను తీసుకొస్తోన్న ఓ ట్రక్కు యూపీలో ఓ వ్యాన్‌ను ఢీకొనడంతో 24 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. లాక్‌డౌన్‌ సందర్భంగా మార్చి నుంచి మే నెల మధ్య 1,461 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 750 మంది మరణించారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సందర్భంగా వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దురదృష్టవశాత్తు మృతుల సంఖ్యలో మాత్రం మార్పులేదు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సెకండ్‌కు ఒకరు చొప్పున మరణిస్తున్నారు. ప్రపంచం మొత్తంగా భారత్‌లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశ ఆర్థిక రంగంపై కూడా ఈ ప్రమాదాలు ప్రభావం చూపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా, గాయపడుతున్న వారి సంఖ్యను సగానికి సగం తగ్గించినట్లయితే 2038వ సంవత్సరం నాటికి దేశ జీడీపీ రేటు సగటున 14 శాతం పెరగుతుంది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తోన్న వారిలో 69 శాతం మంది.. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారు. ఈ వయసు వారే ఎక్కువగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలరు.

దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలకు ముప్పు లేకుండా అందుబాటులో వైద్య సౌకర్యాలను మెరగుపర్చాలని భారత్‌కు ప్రపంచబ్యాంకు తాజాగా సూచించింది. టార్గెట్‌ లక్ష్యంగా పని చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషించాల్సి ఉంటుందని చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2016లో ముంబై–పుణె రహదారిపై ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ చేపట్టిన ‘జీరో ఫాటలిటీ కారిడార్‌ ప్రాజెక్ట్‌’ వల్ల 2019 నాటి రోడ్డు ప్రమాద మతుల సంఖ్య 43 శాతం తగ్గిందని, ఆ తరహా ప్రాజెక్ట్‌ను మిగతా రాష్ట్రాలు కూడా ఆచరించవచ్చని ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనంలో అభిప్రాయపడింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు